తక్కువ ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలు రాజ్యాంగ ఉల్లంఘనే 

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కనబెట్టి, తక్కువ ప్రతిభ ఉన్నవారికి ప్రాధాన్యతనివ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు సుప్రీంకోర్టు సమర్థించింది.
 
పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి 2008లో జార్ఖండ్‌ సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పరీక్ష రాసిన వారిలో 382 మంది ఎంపికయ్యారు. అయితే తుది నియామకంలో కొన్ని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన 42 మందిని కూడా ఎంపిక చేసినట్టు తేల్చింది. దీంతో ప్రభుత్వం వారి నియామకాన్ని రద్దు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ తక్కువ మార్కులు వచ్చిన 42 మంది అభ్యర్థులు జార్ఖండ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
 
అయితే కమిటీ, ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయమే సరైందని పేర్కొంటూ కోర్టు కేసు కొట్టేసింది. దీంతో వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
కాగా,  ఒక ఇంటికి కోడలిగా వెళ్లిన మహిళ తన సోదరులకు, వారి పిల్లలకు ఆస్తిని ఇచ్చే హక్కును కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15(1)(డీ) ప్రకారం ఇది సమర్థనీయమైనదేనని వెల్లడించింది.  జాగ్నో అనే మహిళ భర్త 1953లో మరణించారు. దీంతో భర్త నుంచి తనకు సంక్రమించిన ఆస్తిని ఆమె తన సోదరుడి కుమారులకు రాసి ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. జాగ్నో భర్త సోదరుడు కోర్టులో పిటిషన్‌ వేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. భర్త ఆస్తిపై జాగ్నోకు పూర్తి హక్కు ఉన్నదని, హిందూ వారసత్వ చట్టం ప్రకారం..  ఆ ఆస్తిని సోదరుని వారసులకు ఆమె ఇవ్వొచ్చని కోర్టు చెప్పింది.