డీఎంకే కూటమికి అధికారమిస్తే దోపిడీ రాజ్యమే

రాష్ట్రంలో డీఎంకే కూటమికి అధికారమిస్తే మళ్ళీ దోచుకుంటుందని, ఆ కూటమి నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలనే తపన పడుతుంటారని ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ప్రజలను హెచ్చరించారు. కోయంబత్తూరు కొటీసియా మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన బీజేపీ పార్టీ ప్రచార సభలో పాల్గొంటూ  ‘వెట్టివేల్‌ వీరవేల్‌… వణక్కమ్‌ తమిళనాడు, వణక్కమ్‌ కోవై’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 తమిళనాడు ఈ యేడాది ఓ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నదని, అభివృద్ధిని కాంక్షించే పార్టీలకే మళ్ళీ అధికారం కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయించారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వంతో కలిసి ప్రజలకు అవసరమైన  సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని ప్రధాని భరోసా ఇచ్చారు. 

చిన్న వ్యాపారులు, సన్నకారు రైతులు, నేత కార్మికులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు అధికంగా వున్న కోయంబత్తూరు జిల్లాను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడులో స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా పీఎం ఆవాజ్‌ యోజన కింద 12 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించిందని, జలజీవన్‌ పథకం కింద అన్ని గ్రామాలలో 14 లక్షల ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని ప్రధాని తెలిపారు.

తమిళ సంస్కృతికి, తమిళ పండుగలకు, ప్రాచీన తమిళ భాషకు ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు వుందని ప్రదాని మోదీ కొనియాడారు. వైద్య, ఇంజనీరింగ్‌ కోర్సులను తమిళ మాధ్యమంలోనే అభ్యసించవచ్చునని, ప్రాంతీయ భాషల్లో చదువుకుంటే యువత మంచి పౌరులుగా ఎదిగి దేశానికి నిస్వార్థ సేవలందిస్తారని చెప్పారు.

అంతకు మునుపు కొటీసియా మైదానంలో ఏర్పాటైన ప్రభుత్వ కార్యక్రమంలో రూ.12400 కోట్లతో కొత్త పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తూ తెల్లదొరల పాలనలోనే నౌకా వాణిజ్యం నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావు చిదంబరనార్‌ దీర్ఘ దృష్టి భారతీయులందరికి స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో తమిళనాడు కీలక పాత్రను పోషిస్తున్నదని కొనియాడారు.

పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్‌, పర్యావరణం కీలకమైన అవసరాలని ప్రధాని  తెలిపారు. తాను ప్రారంభించిన ఎన్‌ఎల్‌సీ కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 65 శాతం తమిళనాడుకే కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని సాగుచేసి భుజించేవారే ఉన్నత వ్యక్తులని, తక్కినవారంతా ఇతరులపై ఆధారపడి జీవించే పరాన్న జీవులనే భావంతో కూడిన తిరువళ్లువర్‌ సూక్తిని ఉటంకించారు.

ఈ సభలో నైవేలిలో రూ.8వేల కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన లిగ్నైట్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాఽథపురం విరుదునగర్‌ జిల్లాల్లో 2676 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 వేల కోట్ల వ్యయంతో ఎన్‌ఎల్‌సీఐఎల్‌ సంస్థ ఏర్పాటు చేసిన 700 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ విద్యుత్‌ పథకాన్ని కూడా జాతికి అంకితం చేశారు.

వావుసి చిదంబరనార్‌ ఓడరేవు వద్ద రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన, రైల్వే వంతెనను,.  ప్రధాని నగరాభివృద్ధి పథకం కింద నిర్మించిన కొత్త గృహాలను, రాష్ట్ర  స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు ఆధ్వర్యంలో తిరుప్పూరు, వీరపాండి, మదురై రాజక్కూర్‌ ప్రాంతాల్లో నిర్మించిన గృహాలను ప్రారంభించారు.

అదే విధంగా కీల్‌భవానీ పథకం విస్తరణ పనులు,  కోయంబత్తూరు, మదురై, సేలం, తంజావూరు, వేలూరు, తిరుచ్చి, తిరుప్పూరు, తిరునల్వేలి, తూత్తుకుడి సమా తొమ్మిది స్మార్ట్‌ సిటీలలో రూ.107 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణపు పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వం, మంత్రి ఎస్పీ వేలుమణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.