సోషల్ మీడియాపై ఆంక్షలు స్వాగతించిన విజయశాంతి 

సోషల్ మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తెలిపారు. ఓ దారి, తెన్ను, సరైన విధానాలు లేకుండా సాగుతున్న సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్ నియంత్రణకు కేంద్రం విధించిన నిబంధనలను స్వాగతిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ పేరిట విద్వేషాన్ని రగిల్చే రాతలు, వీడియోలు ఇటీవలి కాలంలో పెచ్చు మీరిపోయాయని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి కారణంగా ఎందరో వ్యక్తులు, కుటుంబాలు మనో వేదనకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నియంత్రణలేని సోషల్ మీడియా, ఓటీటీ తదితర కంటెంట్ వల్ల పలు సందర్భాల్లో వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడిందని, దేశ ఐక్యతకు కూడా ముప్పుగా మారుతోందని ఆమె హెచ్చరించారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిల సంఖ్య పెరిగిపోయిందని ఆమె త్లెఇపారు. 
 
ఇదే విషయంలో పలు మార్లు ఆందోళన కూడా వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీటన్నింటినీ నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు అన్ని వర్గాలకూ శ్రేయస్కరమని విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు.