నీరవ్ మోదీ భారత్‌కు అప్పగింత…యూకే కోర్టు తీర్పు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తూ యూకే కోర్టు తీర్పు వెలువరించింది. ఆయనపై దాఖలైన కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సబబేననీ.. దీనిపై ఆయన భారత్‌కు సమాధానం చెప్పాల్సిందేనని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది.
రూ.14 వేల కోట్ల మేర పీఎన్బీని మోసగించిన ఈ కేసులో సాక్షులను బెదరించడంతో పాటు, ఆధారాలను తారుమారు చేసేందుకు నీరవ్ మోదీ కుట్ర పన్నారని కోర్టు పేర్కొంది. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ కేసు రెండున్న‌ర ఏళ్లుగా యూకే కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది.  మోసం, మ‌నీల్యాండ‌రింగ్ కింద అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి అత‌ను ఇవాళ వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు.  డిస్ట్రిక్ జ‌డ్జి సామ్యూల్ గూజీ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు.  
అప్పగింతకు వ్యతిరేకంగా పోరాడుతున్న 49 ఏళ్ల నీరవ్ మోదీ.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సౌత్‌వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ గూజీ కోర్టు ముందు హాజరయ్యారు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ జారీ అయిన వారెంట్ మేరకు 2019 మార్చి 19న ఆయనను యూకే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి పలుమార్లు ఆయన బెయిల్ కోరుతూ మేజిస్ట్రేట్, హైకోర్టు స్థాయిలో పోరాడినా ఊరట దక్కలేదు.
 
మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియ‌జేయ‌నున్నారు. పీఎన్‌బీకి కోట్లు ఎగ‌వేసిన కేసులో నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌ను భార‌త్ కోరుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నీర‌వ్‌ను భార‌త్‌కు అప్ప‌గిస్తే, అక్క‌డ ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్న దాంట్లో వాస్త‌వం లేద‌ని కూడా కోర్టు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. నీర‌వ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని, భార‌త ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ఆధారాల‌ను గుర్తిస్తున్న‌ట్లు జ‌డ్జి వెల్ల‌డించారు.