మయన్మార్‌ సైన్యంపై దేశ, విదేశాల నుండి తీవ్ర ఒత్తిడి

మయన్మార్‌ సైనిక నేతలు దేశ, విదేశాల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఒకవైపు యురోపియన్‌ యూనియన్‌, అమెరికా మయన్మార్‌పై ఆంక్షలు విధించగా, మరోవైపు దేశంలో సైనిక కుట్రను నిరసిస్తూ బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. సూకీకి తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని కోరుతున్న ఆందోళనకారులపై, ప్రదర్శకులపై అధికారులు క్రమంగా బల ప్రయోగాన్ని పెంచుతున్నారు. 

ఇప్పటివరకు ప్రదర్శనలపై అధికారులు చేపట్టిన అణచివేత చర్యల్లో ముగ్గురు మరణించారు. రాత్రి వేళల్లో అరెస్టులను నిరసిస్తూ యాంగాన్‌ పరిసర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న ఒక వ్యక్తి కూడా ఆదివారం కాల్పుల్లో మరణించాడు. ఇదిలావుండగా, మయన్మార్‌ వైమానిక చీఫ్‌ మాంగ్‌ కియా, మరో జుంటా సభ్యుడు మో మింట్‌ టున్‌లను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. 

గతంలో ఇతర ఉన్నత సైనిక జనరల్స్‌పై ఆంక్షలు ప్రకటించిన తర్వాత తాజాగా ఈ చర్యలు తీసుకుంది. అవసరమనుకుంటే హింసకు, అణచివేతకు పాల్పడుతున్న వారిపై మరిన్ని చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ స్పష్టం చేశారు. నిరసనకారులు, జర్నలిస్టులు, కార్యకర్తలపై తక్షణమే దాడులు ఆపాలని ఆయన కోరారు. 

తిరుగుబాటు జరిగినప్పటి నుండి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని హితవు చెప్పారు. 

మయన్మార్‌ మిలటరీ నేతలను, వారి ఆర్థిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇయు ఆంక్షలు తీసుకున్న కొద్ది గంటల తేడాలోనే అమెరికా కూడా చర్యలు తీసుకుంది. మయన్మార్‌ సంస్కరణల కార్యక్రమానికి ఇయు నుండి అందే ఆర్థిక సాయం అంతా నిలుపుచేయబడుతుందని ఇయు విదేశాంగ చీఫ్‌ జోసెప్‌ బారెల్‌ ప్రకటించారు.