అనంతపురం కలెక్టర్ కు పీఎం కిసాన్‌ అవార్డు 

ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అందుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా బుధవారం ఆయన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు ను అందుకున్నారు. 
 
 ప్రధాన మంత్రి కిసాన్ జాతీయ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపికైంది.   రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకం కింద రైతులకు రూ. 6వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఈ పథకం​ అమలులో అనంతపురం జిల్లా ముందు వరుసలో నిలిచింది.
 
కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో 5శాతం మంది లబ్దిదారులకు సంబంధించి భౌతిక ధృవీకరణ చేశారు. అసలు వీరు పథకానికి అర్హులేనా? సరైన వివరాలే నమోదు చేశారా? అనే అంశాలను పరిశీలించారు. 
 
2018 డిసెంబర్ 1న ప్రారంభించిన ఈ పథకం కింద జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 28,505 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మరే జిల్లాలో లేని విధంగా లబ్ధిదారుల భౌతిక ధృవీకరణను 99.6 శాతం పూర్తి  చేయడంతో జిల్లాకు జాతీయ అవార్డు వరించింది.
జాతీయ అవార్డు అందుకోవడం పట్ల రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు.
 
కాగా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం కిసాన్‌ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)లో చరిత్రాత్మక పెరుగుదలను సాధించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు.
 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నీటి పారుదల ప్రాజెక్టులు మొదలుకొని.. రైతు రుణాలు పెంచడం, పంటకు సరైన బీమా కల్పించడం, నేలపై దృష్టి సారించడం, మధ్యవర్తులను తొలగించడం వంటి ఎన్నో ప్రయత్నాలు ఇందులోఉన్నట్లు వివరించారు. గత రెండేళ్ల కిందట సీఎం కిసాన్‌ పథకం గౌరవ ప్రదమైన జీవితాన్ని, అలాగే కష్టపడి పని చేసే రైతులకు శ్రేయస్సును అందించే లక్ష్యంతో ప్రారంభించినట్లు తెలిపారు.