బోధన్ నకిలీ పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు 

బోధన్‌ పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇప్పటి వరకు తప్పుడు పత్రాలను సమర్పించిన 19 మంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనది. వారిని వెనక్కి రప్పించేందుకు లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేశారు. ఏడు చిరునామాలపై 72 పాస్‌పోర్టులు జారీ అయ్యాయని, వాటిల్లో 46 కేవలం ఐదు ఫోన్‌ నంబర్లతో జారీ అయ్యాయని గుర్తించారు. 

ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది సూత్రధారులుగా నిర్ధారించారు. వారిలో 8 మందిని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. వారిలో నలుగురు బంగ్లాదేశీయులు కాగా, ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. 

 గత నెల 24న ముగ్గురు బంగ్లాదేశీయులు– నితాయ్‌ దాస్‌, మహమ్మద్‌ హసీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌, మహమ్మద్‌ రాణా మియా.. భారత పాస్‌పోర్టులపై దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా.. శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని, ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వారిని విచారించగా.. ఈ వ్యవహారం వెనక భారీ కుంభకోణం ఉన్నట్లు గుర్తించామని సీపీ చెప్పారు.

 ‘‘బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన కొందరు.. పశ్చిమ బెంగాల్‌లో తప్పుడు పత్రాలతో ఆధార్‌కార్డులను సంపాదించారు. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాకు చెందిన షహనాజ్‌ పాయిల్‌ అనే ఏజెంటు వారికి సహకరించాడు. ఆ తర్వాత బంగ్లాదేశీయులు బోధన్‌కు చేరుకుని, ఆధార్‌ కార్డుల్లో స్థానిక చిరునామా మార్పించారు. వాటి సాయంతో బోధన్‌లో పాస్‌పోర్టులు తీసుకున్నారు” అని వివరించారు. 

ఈ కుంభకోణం వెనక మొత్తం 11 మంది ఉన్నట్లు గుర్తించామని.. ముగ్గురు పరారీలో ఉండగా.. ఏఎస్సై అనిల్‌కుమార్‌, ఎస్సై మల్లేశ్‌, ఏజెంట్‌ షహనాజ్‌ పాయిల్‌, దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన నితాయ్‌ దాస్‌, మహమ్మద్‌ హసీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌, మహమ్మద్‌ రాణా మియా, పరిమళ్‌ బెయిన్‌, మీ-సేవ కేంద్ర నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మిర్జాను అరెస్టు చేశామని పేర్కొన్నారు.

 వీరిలో పరిమళ్‌ బెయిన్‌ చాలా కాలం క్రితమే బోధన్‌కు వచ్చి, పాస్‌పోర్టు తీసుకున్నాడని, అతనికి షహనాజ్‌ సాయం చేశాడని చెప్పారు. బంగ్లాదేశీయులకు బోధన్‌లో ఆశ్రయం కల్పించడం, అద్దె గదులు ఇప్పించడం, పాస్‌పోర్టు తీసుకునేదాకా వారి బాగోగులు చూడడం పరిమళ్‌ బాధ్యత అని వివరించారు.

ఎస్సై మల్లేశ్‌, ఏఎస్సై అనిల్‌కుమార్‌లు ఈ గ్యాంగ్‌కు పాస్‌పోర్టు వచ్చేలా.. వెరిఫికేషన్‌లో సహకరించేవారని తెలిపారు. ఈ గ్యాంగ్‌కు పశ్చిమబెంగాల్‌లో తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డు ఇప్పించడంలో సహకరించిన మనోజ్‌ అనే వ్యక్తి ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్నాడని, బంగ్లాదేశీయులను భారత్‌ సరిహద్దులు దాటించడంలో సహకరించే సమీర్‌, విమాన టికెట్లు సమకూర్చిన సద్దాం హుస్సేన్‌లను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.