గుజరాత్ నుంచి 2 రాజ్యసభ సీట్లు బీజేపీ కైవసం

పుదుచ్చేరిలో అధికారంలో కోల్పోయి షాక్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. పార్టీకి నమ్మిన బంటుగా పని చేసిన అహ్మద్‌ పటేల్‌ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. ఆయన మృతితో ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని బిజెపి దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్‌ బలం రాజ్యసభలో తగ్గింది.
గుజరాత్‌‌ నుంచి ఇటీవల ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు సీట్లను ఎలాంటి పోటీ లేకుండానే ఆ పార్టీ నేతలు దినేష్‌చంద్ర జెమల్‌భాయ్ ఆనంవడియ, రామ్‌భాయ్ హర్జీభాయ్ మోకరియా గెలుచుకున్నారు. కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్, బీజేపీకి చెందిన అభయ్ గణ్‌పత్‌రాయ్ భరధ్వాజ్ ఇటీవల కన్నుమూయడంతో ఈ రెండు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక అనివార్యమైంది.  నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇద్దరు బీజేపీ అభ్యర్థుల గెలుపును అధికారులు ధ్రువీకరించారు. 
 
డమ్మీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన బీజేపీకి చెందిన రజనీకాంత్ పటేల్, కీరిత్ సోలంగి శనివారం తమ నామినేషన్లు ఉపంసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి సీబీ పాండ్య తెలిపారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని ఎవరినీ బరిలోకి దింపలేదు. గెలుపుపై నమ్మకం లేకనే అభ్యర్థిని నిలబెట్టలేదని చెబుతున్నారు. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 111 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
 అహ్మద్‌ పటేల్‌ స్థానంలో దినేశ్‌ చంద్ర గెలుపొందగా.. అభయ్‌ స్థానంలో రామ్‌భాయ్‌ గెలిచారు. దీంతో బీజేపీ గుజరాత్‌లో పట్టు నిలుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.