అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు 

కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుండి ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 5 లక్షల మంది మరణించారు. ఆదివారం రాత్రికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 4,98,879కి చేరుకుందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు తెలిపాయి. 

ఈ వైరస్‌తో అమెరికాలో మరణాల సంఖ్య 6 లక్షలకు చేరుతుందని అధ్యక్షుడు బైడెన్‌ జనవరిలోనే హెచ్చరించారు. ఇదొక భయంకరమైన పరిస్థితి. చారిత్రాత్మకమైనది, గతవందేళ్లలో ఇలా అన్నీ మూతపడడం మనం ఎన్నడూ చూడలేదని బైడెన్‌ ముఖ్య వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసి వ్యాఖ్యానించారు. 

చాలావరకు సాధారణ పరిస్థితికి వచ్చేశామని అనుకుంటున్నా, ఈ ఏడాది చివర వరకు చూడాల్సిందేనని ఫౌసి చెప్పారు. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మందికి పైగా ఒక విడత వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దాదాపు 2 కోట్ల మంది వరకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

కాగా మరోవైపు అన్ని దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఆదివారం వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. లక్షలాది మంది వ్యాక్సిన్లు వేయించుకుంటుండడంతో కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కానీ ఇంకా కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

ఆస్ట్రేలియాలో ఉన్నతాధికారులతో సహా కొద్దిమందికి వ్యాక్సిన్‌ వేశారు. జులై నాటికి ప్రతి ఒక్క యువతీ లేదా యువకుడికి మొదటి విడత వ్యాక్సిన్‌ అందుతుందని బ్రిటన్‌ ప్రకటించింది. గాజాకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుండి 20 వేల డోసులు అందాయి.