ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య

దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ముంబైలోని ఓ హోటల్‌లో మోహన్‌ చనిపోయి కనిపించారు. శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాద్రానగర్‌ హవేలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్‌ 2019లో ఆ పార్టీకి రాజీనామా  చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  2004 నుండి పార్లమెంట్ కు ఎన్నికవుతూ వస్తున్నారు. 
 
దక్షిణ ముంబైలోని ఒక హోటల్ లో మృతదేహంతో పాటు  గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. మోహన్ ఆత్మహత్య ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
మోహన్‌కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు.