మహారాష్ట్రలో మరో మంత్రి భుజ్‌బల్‌కు కరోనా

మహారాష్ట్ర మరో మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు సోమవారం కరోనా సోకింది.‘‘నేను సోమవారం చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. గత రెండు మూడు రోజులుగా నాతో కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి.నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, పౌరులందరూ జాగ్రత్తలు తీసుకోండి’’ అని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. 
 
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు పలువురు మంత్రులకు కూడా ఈ వైరస్ సోకింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి మహారాష్ట్రలో కొన్ని ఆంక్షలు విధించారు. రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధించారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని మహారాష్ట్ర సర్కారు సూచించింది.

కరోనా కేసులు పెరుగుతూ పోతుండటంతో  అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్‌ జిల్లాల్లో వారం రోజులు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సోమవారం రాత్రి ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. రాష్ట్రంలో సభలు, సమావేశాలను రద్దు చేశారు. 

తొలుత అమరావతి జిల్లాలో శనివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేశారు. తాజాగా వారం పొడిగించారు. కాగా, కీలక నగరం పుణెతో పాటు నాసిక్‌లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. వచ్చే శుక్రవారం సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యా సంస్థలను నెలాఖరు వరకు మూసివేయనున్నారు. 

మరోవైపు రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే తెలిపారు. 15 రోజుల్లోనే కేసులు 2,500 నుంచి 7 వేలకు చేరినట్లు పేర్కొన్నారు. మరో 8 నుం చి 15 రోజులు పరిశీలిస్తామని.. కేసులు ఇలాగే పెరుగుతుంటే రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధించాలో, వద్దో నిర్ణయిస్తామని చెప్పారు. 

రాజధాని ముంబైలో పాజిటివ్‌లు రెట్టింపునకు మించి వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికి సెకండ్‌ వేవ్‌ కారణమా? కాదా? అనేది రెండువారాల అనంతరం తెలుస్తుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ వద్దనుకుంటే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో  6,971 మందికి వైరస్‌ సోకింది. 35 మంది మృతి చెందారు.  వరుసగా మూడో రోజు కేసులు ఆరువేలు దాటడం గమనార్హం. ఎక్కువ శాతం కేసులు గ్రామీణ ప్రాంతాలు, ముంబైలోని నాన్‌-స్లమ్‌ ప్రాంతాల నుంచే నమోదవుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.  మరోవైపు పుణెలో మూడు నెలల నుంచి అదుపులో ఉన్న కరోనా కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. పుణె డివిజన్‌లో గత 24 గంటల్లో 11176 కొత్త కరోనా కేసులతో పాటు, ఆరుగురు మృతి చెందారు.  కరోనా తీవ్రంగా ఉన్న నాటి కంటే అమరావతిలో ప్రస్తుతం ఎక్కువగా కేసులు వస్తున్నాయి.