బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ వ్యవహారాలపై కొంత కాలంగా శ్రీశైలం గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం గౌడ్  మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 

గత కొద్ది రోజులుగా శ్రీశైలం గౌడ్‌తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో చర్చలు జరుపుతున్నారు. అవి సఫలం కావడంతో తాను త్వరలో బీజేపీలో చేరనున్నట్లు  శ్రీశైలం ప్రకటించారు. 

ఈరోజు ఉదయం ఢిల్లీకి కూన శ్రీశైలం  బయలుదేరారు. అక్కడే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. 2009లో కుత్బుల్లా‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా కూన శ్రీశైలం ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

‘నేను మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. 2009లో పార్టీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్‌గా నిలిచి గెలిచాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడాను. ఏడేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది’ అని విమర్శలు గుపించారు.

పీసీసీ చీఫ్ రాజీనామా చేస్తే కొత్త నాయకుడిని ఎన్నుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అంతర్గత గొడవల వల్లే పీసీసీ చీఫ్ ఎంపికలో ఆలస్యమవుతుందని ధ్వజమెత్తారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందని విమర్శించారు.

ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేయలేదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే సాక్షాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాటం చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.