నర్మదాపురంగా హోసంగాబాద్‌ నగరం 

హోసంగాబాద్‌ నగరాన్ని నర్మదాపురంగా మార్చాలని మధ్యప్రదేశ్ లో  శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు తమ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హోసంగాబాద్‌లో నర్మదా నదీ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గన్న ఆయన నగరం పేరును మారుస్తామని వెల్లడించారు.

నర్మదానదీ తీరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  ఈ నగరానికి ఏ పేరు పెడితే బాగుంటుందని అడగ్గా. అక్కడ ప్రజలు నర్మదా పురం అని సూచించారు. ఈ పేరు ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని శివరాజ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు.

 కాగా,వాతావరణంలో మార్పు కోసం ప్రతి రోజూ ఒక మొక్క నాటాలని  శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ మార్పులు భూమికి ముప్పుగా పరిణమించాయని తెలిపారు. 

పర్యావరణాన్ని పరిరక్షణకు మనం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాను రోజు ఒక మొక్క నాటుతాను, మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలని ప్రజలకు  చౌహాన్ పిలుపునిచ్చారు.

భోపాల్‌లోని సెక్రటేరియేట్‌లో శనివారం మొక్క నాటారు. దేశవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.