పధకం ప్రకారం బెంగాల్ డ్రగ్ కేసులో బిజెపి యువనేత!

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకురాలు పమెలా గోస్వామిని పక్కా పథకంతో కావాలని డ్రగ్ కేసులో ఇరికించి ఉండొచ్చని బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి సమిత్ భట్టాచార్య ఆరోపించారు. ‘కేసు గురించి విన్నాను. అయితే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే చట్టం కచ్చితంగా శిక్షిస్తుంది. అయితే ఇది ప్లాన్ చేసినట్లు కూడా కనిపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. 
 
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమలులోకి రాలేదు. అంటే ప్రస్తుతం పోలీసులు ముఖ్యమంత్రి అధీనంలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ఆలోచిస్తే ఈ అరెస్టుపై అనేక అనుమానాలు కలుగుతున్నాని  స్పష్టం చేశారు. డ్రగ్ కేసులో ఇద్దరు బీజేపీ యువ నేతలను కలకత్తాలో పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి 100 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరిలో ఒకరు పమేలా గోస్వామి కాగా, మరొకరు అదే విభాగానికి చెందిన ప్రబిర్ కుమార్ దే. ఈ కేసులోనే సోమ్‌నాథ్ ఛటర్జీ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పమేలా గోస్వామి రాష్ట్రంలో బీజేపీ తరపున సోషల్ మీడియాలో ఆమె బాగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఆమె తన స్నేహితుడు దేతో కారులో వెళుతుండగా పట్టుకున్నట్లు పోలీలుసు చెప్పారు.
వారి నుంచి దాదాపు 100 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని ఖరీదు లక్షల్లో ఉంటుందని చెప్పారు. స్థానిక న్యూ అలిపోరా ప్రాంతలోని ఓ డ్రగ్ పెడ్లర్ నుంచి వీరు ఆ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారని, పక్కా సమాచారంతోనే వారికి అక్కడ అరెస్టు చేశామని, మహిళా పోలీసులను మొహరించి వారిని అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు.