పెట్రో ధరలు పెరుగుదలపై నిర్మలా ఆందోళన 

పెట్రో ధరలు పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికైనా నచ్చజెప్పేందుకు ఈ ధరలు తగ్గడం తప్ప మరొక సమాధానం లేదని ఆమె స్పష్టం చేశారు. వినియోగదారులకు సమంజసమైన ధరకు పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉండేవిధంగా రిటెయిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరపాలని ఆమె పిలుపునిచ్చారు.

పెట్రోలు, డీజిల్ ధరలు 12 రోజుల నుంచి ప్రతి రోజూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ వంద దాటగా మరికొన్ని నగరాల్లో సెంచరీకి చేరువైంది. 

శనివారం 39 పైసలు పెరగడంతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీ నగరంలో రూ.90కి చేరింది. లీటరు డీజిల్ ధర 37 పైసలు పెరిగి, రూ.80,97కు చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.97కు చేరి, సరికొత్త రికార్డు సృష్టించింది. లీటరు డీజిల్ ధర రూ.88.06కు ఎగబాకింది. 

మధ్య ప్రదేశ్‌లోని నగరబంధ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.76కు చేరింది. ప్రీమియం వేరియంట్‌ను రూ.103.68కి విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.49కి చేరింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇంధనం ధరలు పెరగడానికి కారణం గత ప్రభుత్వాల విధానాలేనని పరోక్షంగా ఆరోపించారు. ప్రస్తుతం పెట్రో ధరలు పెరగడానికి కారణం మన దేశం అధికంగా దిగుమతులపైనే ఆధారపడటమని చెప్పారు. మనలాంటి వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్న దేశం ఇంతగా ఇంధన దిగుమతులపై ఆధారపడవచ్చునా? అని ప్రశ్నించారు.