పోలవరం పనుల్లో నాణ్యతపై కేంద్రం అసంతృప్తి!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతపై కేంద్ర జలసంఘం పరిధిలోని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జలసంఘం మాజీ చైర్మన్‌, డీడీఆర్‌పీ చైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలోని బృందం.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యులతో కలిసి శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. 

ప్రాజెక్టు మొత్తం తిరిగి పనులను, నిర్మాణ ప్రాంతాలను వారు పరిశీలించారు. తొలుత స్పిల్‌ వేపై జరుగుతున్న వంతెన పనులను పరిశీలించారు. స్పిల్‌వేలో 45వ బ్లాక్‌ నుంచి 5వ బ్లాక్‌ వరకు కాలినడకన పర్యటించారు. ప్రతి బ్లాక్‌లో జరిగిన గేట్ల అమరిక పనులను తనిఖీ చేశారు. సంబంధిత వివరాలను ఈఎన్‌సీని అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం స్పిల్‌వే గ్యాలరీలో జరిగిన పనులను, విద్యుత్‌ కనెక్టవిటీ పనులను డీడీఆర్‌పీ బృందం పరిశీలించింది. ఎస్‌ఈ నరసింహమూర్తి, మేఘా కంపెనీ ఇంజనీర్లు జరుగుతున్న పనుల తీరును వివరించారు. 

అనంతరం బృంద సభ్యులు స్పిల్‌ చానల్లో మట్టి తరలింపు పనులను, స్పిల్‌ వే ఎడమ వైపు జరుగుతున్న కాంక్రీటు పనులను, ఎగువ కాఫర్‌ డ్యాం పనులను, కుడి ప్రధాన కాలువ అనుసంధాన పనులను పరిశీలించారు. హెడ్‌ వర్క్స్‌ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు ఇంజనీరింగ్‌ వర్గాలు వెల్లడించాయి.

ప్రధానంగా గేట్ల బిగింపు సమయంలో వెల్డింగ్‌, గేట్లకు అమర్చే కేబుళ్లను కమిటీ పరిశీలించింది. సివిల్‌, మెకానికల్‌ పనుల్లో నాణ్యత పరిశీలనకు ఈ రంగంలో నిష్ణాతులైన ఇద్దరేసి ఇంజనీర్లను పాండ్యా కమిటీ తన వెంట తీసుకొచ్చింది. గేట్ల బిగింపు సరిగా లేకపోతే.. ఇటీవల తపోవన్‌ ప్రాజెక్టు తరహాలో గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కాగా.. ఆయా బృందాలు శనివారం తూర్పుగోదావరి జిల్లా అంగులూరు సమీపంలోని ఎడమ కాలువ కనెక్టివిటీ పనులను, గ్యాప్‌-1 పనులను పరిశీలిస్తాయి. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.