అరుణ గ్ర‌హంపై దిగిన అమెరికా రోవ‌ర్‌

అరుణ గ్ర‌హంపై నాసా ప్ర‌యోగించిన రెండో తరం ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ ఇవాళ సుర‌క్షితం గాదిగింది.  అమెరికా కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3.55 నిమిషాల‌కు ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ మార్స్‌పై దిగింది. సుమారు 203 రోజులు, దాదాపు 300 మిలియ‌న్ మైళ్ల ప్ర‌యాణం త‌ర్వాత రోవ‌ర్ సుర‌క్షితంగా అంగార‌క గ్ర‌హంపై అడుగుమోపింది.  ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ ఇక మార్స్ గ్ర‌హంపై జీవం ఆన‌వాళ్ల గురించి శోధించ‌నున్న‌ది.  

ట‌చ్‌డౌన్ స‌క్సెస్ అయిన‌ట్లు కాలిఫోర్నియాలో ఉన్న జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ‌రేట‌రీ స్ప‌ష్టం చేసింది. గ‌త ఏడాది జూలై 30వ తేదీన మార్స్ 2020 మిష‌న్‌ను ఆవిష్క‌రించారు. అప్పటినుంచి అంతరిక్షంలో నిర్దిష్ట కక్ష్యలో ప్రయాణించి అంగారకుడిని చేరింది. అంగార‌క గ్ర‌హం నుంచి శ్యాంపిళ్ల‌ను సేక‌రించి, ఆ శ్యాంపిళ్ల‌ను భూమిపైకి తీసుకురానున్నారు.  ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌తో పాటు ఇన్‌జెన్యూటీ హెలికాప్ట‌ర్‌ను కూడా నాసా ప్ర‌యోగించింది.

అంగార‌క గ్ర‌హంపై ఇన్‌జెన్యూటీ హెలికాప్ట‌ర్ కొన్ని చ‌క్క‌ర్లు కొట్ట‌నున్న‌ది.  అరుణ గ్ర‌హంపై మాన‌వ ఆన‌వాళ్లు కనుగొనేందుకు ఈ మిష‌న్ తోడ్ప‌డుతుంద‌ని నాసా శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు.  మార్స్ మ‌ధ్య ప్రాంతంలో ఉన్న జెజీరో క్రాట‌ర్ వ‌ద్ద ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్ దిగింది.  ఈ రోవ‌ర్ సుమారు ఓ కారు సైజు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  అది దాదాపు  2263 పౌండ్లు లేదా 1026 కిలోల బ‌రువు ఉన్న‌ది.

జెజీరోలో ఉన్న పురాత‌న న‌ది ప‌రివాహ‌క ప్రాంతాన్ని ప‌ర్సీవ‌రెన్స్ శోధించ‌నున్నారు.  అక్క‌డ రాళ్ల‌ను, మ‌ట్టిని అది సేక‌రించ‌నున్న‌ది.  ఆస్ట్రోబ‌యోల‌జీ డేటాను స‌మీక్షించ‌నున్నారు.  సుమారు 3.5 బిలియ‌న్ల ఏళ్ల క్రితం జెజీరో క్రాట‌ర్ వ‌ద్ద న‌ది ప్ర‌వహించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.  అత్యాధునిక రోబోటిక్ మెషిన్ రూపంలో ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌ను త‌యారు చేశారు.

మార్స్ గ్ర‌హంపై కొత్త రోవ‌ర్ ఉన్న‌ట్లు అమెరిక‌న్ స్పేస్ ఏజెన్సీ ప్రక‌టించింది.  స్పేస్‌క్రాఫ్ట్ అద్భుతంగా ల్యాండ్ అయిన‌ట్లు మిష‌న్ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజ‌ర్ మ్యాట్ వాలెస్ తెలిపారు.  క‌నీసం రెండేళ్ల పాటు ఆ రోవ‌ర్ మార్స్ గ్ర‌హంపై గ‌డ‌ప‌నున్న‌ది. జెజీరో క్రాట‌ర్‌లో నీరు ప్ర‌వ‌హించిన ఆధారాలు ఉన్నాయి కాబ‌ట్టి.. అక్క‌డ జీవం కూడా ఉండి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.