జమ్ముకశ్మీర్‌లో 11 నెలల తర్వాత రైళ్లు  

కొవిడ్-19 కారణంగా సుమారు 11 నెలలు అనంతరం జమ్ముకశ్మీర్‌లో రైళ్లు త్వరలో పాక్షికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల చివరి వారంలో రైలు సేవలను పాక్షికంగా పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 19 నుంచి జమ్ముకశ్మీర్‌లో రైల్‌ సేవలను నిలిపివేశారు.

అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణానికి చేరుకుంటుండటంతో తిరిగి రైళ్లను నడిపేందుకు యోచిస్తున్నట్లు నార్తర్న్‌ రైల్వే చీఫ్‌ ఏరియా మేనేజర్‌ సాకిబ్‌ యూసుఫ్‌ చెప్పారు. కశ్మీర్‌ నుంచి రైళ్లు ఇంకా దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడలేదు.

దక్షిణాన కశ్మీర్‌కు ప్రవేశ ద్వారంగా పేర్కొనే బనిహాల్ నుంచి ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వరకు 137 కిలోమీటర్ల దూరం మేర స్వతంత్ర మార్గంలో రైళ్లు నడుస్తాయి. బనిహాల్-బారాముల్లా విభాగం మధ్య సేవలను పాక్షికంగా పునరుద్ధరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు సహకరించాలని రైల్వే పోలీసులకు రైల్వే అధికారులు లేఖ రాశారు.

దీనిపై విచారించిన రైల్వే పోలీసుల రైళ్లు పాక్షికంగా నడిపేందుకు తమ సహకారం ఉంటుందని తెలుపడంతో ఈ నెలాఖరులో తిరిగి రైలు సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో ఈ విషయంపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సాకిబ్‌ యూసుఫ్ చెప్పారు.

తొలుత బనిహాల్‌-బారాముల్లా మధ్య ఒక రైలును ప్రయోగాత్మకంగా నడిపి, ఆ తర్వాత మిగతావి కూడా నడిపేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో రైళ్ల సేవలను నిలిపివేయడంతో రైల్వే ఎక్కువ మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

కశ్మీర్‌లో ప్రజలు వంద శాతం రైళ్లను వినియోగించుకుంటారు. ప్రతిరోజు 35 వేల నుంచి 40 వేల మంది రైలు సర్వీసులను వినియోగించుకుంటారు. అదే శీతాకాలంలో ఈ సంఖ్య 25 వేలకు పరిమితం అవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు 2019 లో జమ్ముకశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా తలెత్తిన విబేధాలతో దాదాపు 100 రోజులపాటు రైళ్ల సేవలు నిలిచిపోయాయి.

2010 ఆందోళన సమయంలో కోచ్‌లు దెబ్బతిన్న తరువాత సేవలు నిలిచిపోయాయి. 2016 లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వని హత్య తరువాత ఆరు నెలలకు పైగా సేవలు నిలిపివేయబడ్డాయి. 2014 వరదల సమయంలో కూడా రెండు నెలలకు పైగా రైళ్ల సేవలను నిలిపివేశారు.