భారత్‌ ను విశ్వగురు స్థానంలో నిలపడానికే నూతన విద్యావిధానం 

నూతనంగా రూపొందించిన విద్యావిధానం భారత్‌ విశ్వగురు స్థానంలో నిలపడానికి ఉపకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. భారత్ విశ్వగురు వైపు ప్రయాణించడానికి ఈ విద్యా విధానం దోహదపడుతుందని తెలిపారు. 
 
విశ్వ భారతి యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ విద్యా విప్లవంలో ఈ విధానం ఓ గేమ్ ఛేంజర్‌ అని పేర్కొన్నారు. నూతన విద్యావిధానం దేశాన్ని ఆత్మనిర్భర భారత్ వైపు తీసుకెళ్తుందని, కొత్త కొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు కూడా దోహదపడుతుందని తెలిపారు. 

విశ్వ భారతి విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థను గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సమున్నత లక్ష్యంతో అభివృద్ధి చేశారని ప్రధాని మోదీ చెప్పారు. లోబడి ఉండాలనే సంకెళ్ళ నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆధునికీకరించడం లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లక్ష్యం కూడా పాత సంకెళ్ల నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడమేనని మోదీ చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగలిగే స్వేచ్ఛను నూతన విద్యా విధానం ఇస్తుందని తెలిపారు. స్వయం సమృద్ధ భారత దేశం వైపు వేసిన గొప్ప ముందడుగు నూతన జాతీయ విద్యా విధానమని పేర్కొన్నారు. పరిశోధన, నవకల్పనలకు ఈ విధానం శక్తినిస్తుందని చెప్పారు. 

2021 కేంద్ర బడ్జెట్‌లో జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ ద్వారా రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. పరిశోధన ఆధారిత అధ్యయనం కోసం రానున్న ఐదేళ్ళలో ఈ సొమ్మును ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందని పేర్కొంటూ  మేధస్సులో సకారాత్మక, నకారత్మక రెండు ఆలోచనలూ ఉంటాయని, రెంటికీ తగ్గ దారులూ ఉంటాయని, అయితే  ఏ వైపుగా వెళితే సమస్య తీరిపోతుందన్న దానిపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.  

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని, హింసను ప్రేరేపించేవారంతా బాగా చదువుకున్న వారేనని, బాగా నైపుణ్యం కలవారని వివరించగా, మరోవైపు కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కాపాడడానికి అహోరాత్రాలు శ్రమిస్తున్నవారూ ఉన్నారని మోదీ గుర్తు చేశారు. ఇదంతా సైద్ధాంతిక భూమిక ఎంత మాత్రమూ కాదని, అది ఆలోచనా విధానమని మోదీ వివరించారు.