విదర్భ రీజియన్‌లోలాక్‌డౌన్‌ 

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో విదర్భ రీజియన్‌లో ఉన్న యావత్మాల్‌ జిల్లాలో పది రోజుల లాక్‌డౌన్‌ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నుంచే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఇదే ప్రాంతంలో ఉన్న అమరావతి జిల్లాలో శనివారం రాత్రి 8 నుంచి గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. 

ఈ నెల చివరి వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నారు. కాగా, రాజధాని ముంబైలోనూ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని మంత్రి అస్లాం షేక్‌ తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో బుధవారం 4,787 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. గురువారం 5 వేలు దాటాయి. కొత్త సంవత్సరంలో ఇవే అత్యధికం. ఇందులో విదర్భ ప్రాంతం నుంచే కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అమరావతిలో 230, అకోలాలో 105 మందికి పాజిటివ్‌ వచ్చింది.

మరోవైపు మహారాష్ట్ర జల వనరుల మంత్రి, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌కు కరోనా సోకింది. ఈ నెల 16న ముంబైలో పాటిల్‌ జన్మదిన వేడుకలు భారీఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఎవరూ నిబంధనలు పాటించలేదు. మంత్రి ఇటీవల కార్యకర్తలను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు.

కాగా, టీకా పంపిణీ మొదలై నెల దాటినా.. సగంమంది ఆరోగ్య రంగ కార్యకర్తలు కూడా టీకా తీసుకోకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. వ్యాక్సిన్‌కు ముందుకురాని వారికి భవిష్యత్‌లో కరోనా ఉచిత చికిత్స పొందే వీల్లేకుండా చేయాలని చూస్తోంది. అయితే, ఆరోగ్య కార్యకర్తలందరికీ టీకా ఇచ్చేందుకు ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో దీనిపై ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు రాలేదు.

టీకా తీసుకుంటే.. సంతానం కలగదని, మరికొన్ని వదంతులతో కర్ణాటకలో పంపిణీ వేగం అందుకోలేదు. మరోవైపు రాష్ట్రంలోని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల్లో 65 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వారికంటే విద్యావంతులైన వైద్యులు, నర్సులు మాత్రం అయిష్టత చూపుతున్నారు.