ఆసియా శతాబ్దంకు దేశాల మధ్య సమైక్యత తప్పనిసరి

21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కావాలంటే, దక్షిణాసియా దేశాలు, హిందూ మహా సముద్ర దీవుల మధ్య సమైక్యత తప్పనిసరి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దేశాల మధ్య ఐకమత్యం లేకపోతే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోదని హెచ్చరించారు. 

 ‘కోవిడ్-19 మేనేజ్‌మెంట్ : ఎక్స్‌పీరియెన్స్, గుడ్ ప్రాక్టీసెస్ అండ్ వే ఫార్వర్డ్’ పేరుతో దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య వర్చువల్విధానంలో జరిగిన వర్క్‌షాప్ లో మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి పీడిస్తున్న సమయంలో చూపిన ప్రాంతీయ సంఘీభావ స్ఫూర్తి ఇటువంటి సమైక్యత సాధ్యమేనని నిరూపించిందని పేర్కొన్నారు. 

సవాళ్ళ పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని  ప్రధాని పిలుపిచ్చారు. అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం, దృఢనిశ్చయంతో వ్యవహరించడం వల్ల ప్రపంచంలో అతి తక్కువ మరణాల రేటు ఈ ప్రాంతంలో నమోదైందని చెప్పారు. 

ఇక ఈ ప్రాంతంతోపాటు ప్రపంచం ఆశలన్నీ సత్వరమే వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడంపైనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. దీనిలో కూడా మనమంతా అదే విధమైన సహకార స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ పది దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆరోగ్య రంగంలో అందించిన సహకారం గొప్ప విజయం సాధించిందని కొనియాడారు.

తమ ఆశయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. డాక్టర్లు, నర్సులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక వీసాల పథకాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు సేవలందించేందుకు ఎయిర్ అంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంపై ఈ దేశాల పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు కృషి చేయాలని ప్రధాని సూచించారు.