న్యాయవాద దంపతులు హత్యకు టీఆర్ఎస్ కారణం

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యకు గురవ్వడం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ హత్యలకు టీఆర్ఎస్ గూండాలే కారణం అని ఆరోపించారు. రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం జరిగింది. కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పరారయ్యారు.
 
టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు వ్యతిరేకంగా చాలామంది బాధితులు అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిలను ఆశ్రయించారు. వీరిద్దరు నిజాయితీగా పేద ప్రజలకు అండగా నిలబడి న్యాయపరంగా పోరాడుతున్నారు. అయితే, చివరకు వారు కూడా దారుణ హత్యకు గురికావడం బాధాకరం అని సంజయ్ పేర్కొన్నారు.
 
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై వామన్ రావు దంపతులు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్స్ వేశారు. అటు అనేక సంచలనాలకు సంబంధించి కేసులు కూడా వాదిస్తున్నారని ఆయన తెలిపారు. 
 
గతంలో శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో వామన్ రావు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించగా వారికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ హత్యలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినవే అని స్పష్టం చేశారు.
హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదని సంజయ్ చెప్పారు. కొంతమంది మంథనికి చెందిన అధికార పార్టీ నాయకులు పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసి ముఖ్యమంత్రి పుట్టినరోజు గిఫ్టుగా ఇచ్చారని సంజయ్ పేర్కొన్నారు. వామన్ రావు దంపతుల హత్య ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.  దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయిలో  విచారణ జరిపించాలని కోరారు.