పరిషద్ ఎన్నికలకు ఎన్నికలే వద్దన్న జగన్ ప్రభుత్వం సై  

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేయగానే  కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దృష్ట్యా జరపడం సాధ్యం కాదని పెద్ద ఎత్తున రసభ సృష్టించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయమై సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా జరుగుతూ ఉండడం, మునిసిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పుడు జిల్లా పరిషద్ ఎన్నికలు కూడా వీటితో పాటు జరిపించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చింది. 

 న్యాయస్థానం ఆదేశాల మేరకు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోతుండడంతోపాటు కరోనా కేసుల సంఖ్య కూడా పెరగక పోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా జరిపించేస్తే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిపోతుందనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. 

పంచాయతీ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌ బుధవారం జరగనున్న నేపథ్యంలో విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కలిశారు. మూడోదశ పంచాయతీ ఎన్నికల ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదిత్యనాథ్‌దా్‌సకు నిమ్మగడ్డ సూచించారు. 

ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశమూ చర్చకు వచ్చింది. గతేడాది మార్చి 15న కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన సందర్భంగా ఎస్‌ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌లోని అంశాలను ఎస్‌ఈసీ వద్ద సీఎస్‌ ప్రస్తావించారు. ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచే ప్రారంభిస్తామంటూ ఎస్‌ఈసీ పేర్కొన్న విషయాన్నిగుర్తుచేశారు. 

వాయిదా వేసినప్పటి నుంచే యథాతథంగా చేపట్టాలని కోరగా ఈ అంశం పరిశీలిస్తామని ఎస్‌ఈసీ హామీ ఇచ్చారు. దానితో జిల్లా పరిషద్ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరోవంక, పురపాలక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల వివరాలను తెలపాలని పురపాలక శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. గతేడాది మార్చి 23న జరగాల్సిన ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడి, సుమారు సంవత్సరం తర్వాత వచ్చే నెల 10న జరగనున్నాయి. 

అయితే.. అప్పట్లో ఈ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ హోదాల్లో నియమితులైన పురపాలక శాఖ అధికారుల్లో పలువురు గడిచిన ఏడాది కాలంలో బదిలీ కావడమో లేదా ఉద్యోగ విరమణ చేయడమో జరిగింది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో ఆయా చోట్ల ఇతర అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ఎన్నికల సంఘం  అటువంటి అధికారులను గుర్తించి, వారి స్థానాల్లో నియమించదగిన అధికారుల పేర్లతో ఒక జాబితాలను తమకు పంపాల్సిందిగా కోరింది. 

కాగా,  సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్‌ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.