ఇస్లామీకరణ పెరుగుదల కట్టడికి ఫ్రెంచ్ బిల్లు

పట్టణాలు, నగరాల్లో ఇస్లామీకరణ పెరుగుదలను కట్టడి చేసేందుకు ఓ బిల్లును ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఈ చట్టంలో మతం పేరును ప్రత్యేకంగా పేర్కొనలేదు. అయితే బలవంతపు పెళ్లిళ్లు, కన్యత్వ పరీక్షలు వంటి ఆచారాలపై కొరడా ఝళిపించింది.

హింసను ప్రేరేపించే ఆన్‌లైన్ అపాలజిస్టులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. మతపరమైన సమావేశాలు, సంఘాలపై గట్టి నిఘా పెట్టేందుకు, ప్రధాన జీవన స్రవంతిలోని పాఠశాలల్లో కాకుండా, ఇతర చోట్ల విద్యా బోధనపై కూడా కఠినమైన ఆంక్షలను విధించింది. 

ఫ్రాన్స్‌లో సుమారు 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వీరంతా అల్జీరియా, ఇతర ప్రాంతాల మూలాలుగలవారు. ఫ్రాన్స్‌లో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగాయి. వచ్చే సంవత్సరం ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మతపరమైన తీవ్రవాదం, ఫ్రెంచ్ ఐడెంటిటీ, డొమెస్టిక్ సెక్యూరిటీ ప్రధాన ప్రచారాంశాలు కాబోతున్నాయి.

ఈ బిల్లుపై ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డర్మనిన్ మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా కఠినమైనదని, అయితే దేశానికి ఇది అవసరమని తెలిపారు. పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 347 ఓట్లు, వ్యతిరేకంగా 151 ఓట్లు లభించాయి. దీనిని సెనేట్‌లో ప్రవేశపెడతారు. సెనేట్‌లో ప్రతిపక్షాలకు ఆధిక్యం ఉంది.