విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీఎంఎస్‌ అభ్యంతరం 

ప్రతిష్ఠాత్మకమైన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో అతిపెద్ద కార్మికసంఘమైన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌  (బీఎంఎస్‌) గట్టిగా వ్యతిరేకించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాసింది.
 
 విశాఖ ఉక్కు సహా ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదని ఆ లేఖలో విస్పష్టంగా పేర్కొంది. లేఖ ప్రతిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపింది. ‘ప్రైవేటీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాధారణ ప్రజల్ని అత్యంత రెచ్చగొట్టేదిగా ఉందని ప్రత్యేకంగా చెప్పక తప్పదు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
`విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల ఆందోళన ఇప్పుడు సామాజిక ఉద్యమంగా మారింది. ఏదైనా నిరసనలు, ఆందోళనలు చేపట్టేముందు ప్రభుత్వంతో ఒకసారి చర్చించడానికి మేం ప్రాధాన్యమిస్తాం. అందువల్ల ప్రధానమంత్రి దీనిపై వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’ అని బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి బినయ్‌కుమార్‌ సిన్హా ఈ లేఖలో తెలిపారు. 
 
రైల్వే, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డుల ప్రైవేటీకరణనూ ఈ సందర్భంగా ఆయన వ్యతిరేకించారు. పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకం, కార్పొరేటీకరణ వంటివి ప్రజల మనసుల్ని, ముఖ్యంగా ఉద్యోగుల్ని మనస్తాపానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు ప్రైవేటీకరణ బాట పట్టడాన్ని తప్పుపడుతూ చెన్నైలో జరిగిన బీఎంఎస్‌ ‘కేంద్రీయ కార్య సమితి’ (కేకేఎస్‌) తీర్మానం చేసింది.