తెలుగు రాష్ట్రాలలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు మండిపోతున్నాయి.  ఏపీ, తెలంగాణలో అదనపు పన్నులు విధిస్తుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే పెట్రో ధరలు మండిపోతున్నాయి.

తెలంగాణలో అయితే లీటరు పెట్రోల్‌పై రూ. 4, లీటరు డీజీల్‌పై రూ. 2.. రాష్ట్ర పన్ను పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి డీజీల్‌పై కూడా తొలుత రూ. 4 వసూలు చేయాలని భావించినా.. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దాన్ని రూ. 2లకు తగ్గించారు. వ్యాట్‌పై అదనంగా ఈ పన్నులు విధిస్తున్నాయి.

ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై 33 శాతం, డీజీల్‌పై 26 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే అదనపు పన్ను రూపంలో వసూలైన మొత్తం రాష్ట్రాల ఖాజానాలోకే ఈ డబ్బులు చేరిపోతున్నాయి. 

తమ కమిషన్లలో పెంపులేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. వారికి ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రూ. 3.4, డీజిల్‌పై రూ. 2.3 కమిషన్ మాత్రమే ముడుతోంది. తెలంగాణలో కన్నా ఏపీలో లీటర్ కు రూ 4 నుండి రూ 5 వరకు అధికంగా ధరలు వసూలు చేస్తున్నారు.