టూల్ కిట్ షేర్ చేస్తున్న దిశరవి అరెస్ట్

బెంగళూర్‌కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త దిశ రవి(21)ని ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు  అరెస్ట్ చేశారు. దిశరవిని శనివారమే బెంగళూర్‌లోని సోలాదేవనహల్లిలోని ఆమె ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం దిశరవిని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరచగా, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశాలిచ్చారు.

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా రూపొందించిన టూల్‌కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు దిశరవిపై దేశద్రోహంసహా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టూల్‌కిట్ రూపకల్పనలో దిశరవిది కీలక పాత్ర అని పోలీసులు ఆరోపిస్తున్నారు.

భారత దేశంపై అసమ్మతిని వ్యాపింపజేసేందుకు దిశ రవి ఖలిస్థాన్ అనుకూల సంస్థ అయిన పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో కలిసి పని చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌తో టూల్‌కిట్ డాక్యుమెంట్‌ను షేర్ చేసుకున్నవారిలో దిశ రవి ఒకరు. 

 ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్) పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో దిశరవి పాల్గొంటున్నారు. ఈ టూల్ కిట్ లో సూచించిన ట్వీట్ లనే అంతర్జాతీయ సెలెబ్రెటీలు పలువురు రైతు ఉద్యమానికి మడ్దతుగా ఇస్తున్నట్లు భావిస్తున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన దిశరవి గుడ్‌మిల్క్ కంపెనీలోని పోషక నిపుణుల విభాగంలో మేనేజర్‌గా పని చేస్తున్నారు.

ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌కు శ్రీకారం చుట్టిన స్వీడన్ యువతి గ్రెటా థన్‌బర్గ్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా టూల్‌కిట్‌ను రూపొందించారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఈ టూల్‌కిట్‌ను రూపొందించారని కేంద్రం ఆరోపించింది. 

ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసులు గత వారం గూగుల్‌కు లేఖ రాశారు. రైతుల నిరసనలకు సంబంధించిన టూల్‌కిట్‌ను ఏ అకౌంట్ నుంచి పంపించారు? ఏ విధంగా ఇతరులకు వ్యాప్తి చెందింది? వంటి వివరాలను సమర్పించాలని కోరింది. ఈ టూల్‌కిట్‌లో రెండు ఈ-మెయిల్ ఐడీలు, ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, ఒక యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్  ఉన్నట్లు తెలుస్తోంది.