కేరళ బీజేపీ ‘విజయ యాత్ర’ ప్రారంభించనున్న యోగి 

కేరళ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచార భేరి త్వరలోనే మోగబోతోంది. ‘విజయ యాత్ర’ పేరుతో రథయాత్రను ఈ నెల 21 నుంచి ప్రారంభించబోతోంది. ఈ యాత్రలో ఆ పార్టీ అగ్ర నేతలు పాల్గొంటారు.

ఫిబ్రవరి 21న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ‘విజయ యాత్ర’ను జెండా ఊపి ప్రారంభిస్తారు. కాసర్‌గోడ్‌నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర మార్చి మొదటి వారంతో తిరువనంతపురంలో ముగుస్తుంది. దక్షణాదిలో పట్టు పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నసంగతి తెలిసిందే. విజయ యాత్రను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన తర్వాత కేబినెట్ మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు ఈ యాత్రలో పాల్గొంటారు. 

కేరళ బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం, అమిత్ షా గతంలో చేపట్టిన జనరక్షణ యాత్ర మాదిరిగానే విజయ యాత్రను నిర్వహిస్తారు. అయితే బీజేపీ కార్యకర్తలపై రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ జన రక్షణ యాత్రను నిర్వహించారు. కేరళ శాసన సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార భేరిని మోగించేందుకు విజయ యాత్రను నిర్వహించబోతున్నారు. 

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కేరళలో ఆ పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కేరళలో 140 శాసన సభ స్థానాలు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో కేరళలో తొలిసారి బిజెపి ఒక స్థానం గెలుచుకొన్నది. ఈ పర్యాయం రెండంకెల స్థానాలకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.