వారసుడు లేకుండానే జస్టిస్ బోబ్డే ఉద్యోగ విరమణ!

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎవరన్నదానిపై సందిగ్ధం కొనసాగుతున్నది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. తన వారసుడి గురించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేయకుండానే ఉద్యోగ విరమణ కావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆయన తర్వాత సీజేఐ ఎవరు కావాలన్న అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటీ (కొలీజియం) ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, రోహింగ్టన్‌ నారీమన్‌, యూయూ లలిత్‌, ఏఎం ఖాన్విల్కర్‌ ఉన్నారు.

కొలీజియంలో ఏకాభిప్రాయం లేకపోవటంతో తదుపరి సీజేఐ ఎంపిక ముందుకు సాగటం లేదు.  గత ఆరు నెలలుగా వారు కనీసం సమావేశం కాలేదు. దానితో పలువురు న్యాయమూర్తుల  నీయమకాలు సహితం ముందుకు సాగడం లేదు. 2015లో జాతీయ జ్యూడిషియల్ కమీషన్ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ మధ్య వివాదం నెలకొన్న సమయంలో కూడా ఇదే విధంగా జరిగింది. దానితో జస్టిస్ హెచ్ ఎల్ దత్తు తన వారసుడి గురించి సిఫార్స్ చేయకుండానే ఉద్యోగ విరమణ చేశారు.

ముఖ్యంగా త్రిపుర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్హ్టి జస్టిస్ అఖిల్ ఖురేషీని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా నియమించే విషయంలో కొలీజియంలో ప్రస్తుతం ఏకాభిప్రాయం లోపించిన కారణంగా ప్రతిష్టంభన కొనసాగుతున్నది. వచ్చే నెలలో ఇద్దరు న్యాయమూర్తులు రిటైర్ అవుతుండగా, ఈ సంవత్సరం మరో నలుగురు రిటైర్ కానున్నారు. ఇప్పటికే నలుగురు న్యాయమూర్తుల నియామకం సుప్రీం కోర్ట్ లో జరుగ వలసి ఉంది. అయినా కొలీజియం సమావేశమై ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితా ఇలా ఉంది- 1. జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే 2. జస్టిస్‌ ఎన్వీ రమణ 3. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ 4. జస్టిస్‌ యూయూ లలిత్‌ 5. జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ 6. జస్టిస్‌ చంద్రచూడ్‌ 7. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ 8. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌రావు 9. జస్టిస్‌ ఎస్కే కౌల్‌ 10. జస్టిస్‌ మోహన్‌ శంతనగౌడార్‌.