ట్రంప్‌ను నిర్ధోషిగా తేల్చిన సెనేట్ 

క్యాపిటల్‌ హిల్స్‌ ఘటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను సెనేట్‌ నిర్ధోషిగా తేల్చింది. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని నాలుగురోజులపాటు విచారించిన సెనేట్ చివరకు మాజీ అధ్యక్షుడిని నిర్దోషిగా ప్రకటించింది. 

వంద మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటువేయగా అనుకూలంగా 43 ఓటు వేశారు. దీంతో శిక్షకు అవసరమైన మూడింట రెండు వంతుల కంటే పది ఓట్ల తక్కువ రావడంతో అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు ట్రంప్‌ను అభిశంసించేందుకు ఓటు వేసినా.. చివరకు అవసరమైన 67 ఓట్లు రాలేదు.

అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్‌ నిలువగా.. పదవి నుంచి వైదొలిగిన అనంతరం కూడా అభిశంసనను ఎదుర్కొవడం గమనార్హం. సెనెట్‌ తనను నిర్ధోషిగా ప్రకటించిన వెంటనే ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు.

తాను అస్థిరమైన చట్టాలకు వ్యతిరేకంగా ఉంటానని, శాంతియుతంగా పలు సమస్యలపై చర్చించే హక్కు అమెరికా చట్ట సభ్యులకు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే మరో అధ్యాయమని పేర్కొన్నారు. న్యాయాన్ని, సత్యాన్ని సమర్థిస్తూ తనకోసం పనిచేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. 

గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జోబైడెన్..‌ ట్రంప్‌పై విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన విషయం తెలిసిందే. జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ ధ్రువీకరించేందుకు క్యాపిటల్‌ హిల్స్‌ భవనంలో యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. 

ఈ క్రమంలో ట్రంప్‌ మద్దతుదారులు భవనంలోకి చొచ్చుకెళ్లడంతో హింస చెలరేగింది. ఈ ఘటనకు ముందు మద్దతుదారులనుద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే హింసకు కారణమని ఆరోపిస్తూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.