వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీస్, రెవిన్యూ అధికారులు 

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరు జిల్లా రెంటచింతల, దాచేపల్లి మండలాల్లో ఆయన పర్యటిస్తూ ఎన్నికల్లో పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అధికార పార్టీ విజయానికి కొమ్ము కాశారని ఆరోపించారు. 

అధికారులు గెలిచిన ఇతరపార్టీ నాయకులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల అభ్యర్థులు రక్షణకోసం పోలీసుల వద్దకు వెళ్తే బెదిరింపులు, కేసులు నమోదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. 

అరాచక పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలలో బలవంతపు విజయాలకు విలువ లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాగా, కుటుంబ పార్టీలకు స్వస్తి పలకడమే బీజేపీ లక్ష్యమని వీర్రాజు ప్రకటించారు. కేంద్ర పథకాలకు వైసీపీ రంగులేసి గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గురజాల మెడికల్ కాలేజీకి రూ.50కోట్లు ఇచ్చేది కేంద్రమేనని తెలిపారు.

మరోవైపు సోమవారం సోము వీర్రాజు, ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 సోమవారం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి అమిత్‌షాను కలుస్తామని సోమువీర్రాజు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మటానికి వీల్లేదని స్పష్టం చేశారు.