ఐరాస అత్యున్నత పదవికి భారత సంతతి మహిళా పోటీ!

ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత స్థానమైన ప్రధాన కార్యదర్శి (సెక్రెటరీ జనరల్‌) పదవి కోసం భారత సంతతి మహిళ అరోరా ఆకాంక్ష పోటీలో నిలిచారు. యూఎన్‌డీపీలో ఆడిట్‌ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకాంక్ష తాను సెక్రెటరీ జనరల్‌ పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ప్రచార వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 

శరణార్థులకు రక్షణ కల్పించడం, మానవతా సాయం అందించడం, పెరుగుతున్న సాంకేతికతలో ఏర్పడుతున్న కొత్త సమస్యలను పరిష్కరించడంలో, ఐరాసను ప్రపంచానికి జవాబుదారీ చేయడంలో ఇంతకుముందున్న ప్రధాన కార్యదర్శులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రపంచానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఐరాస సఫలీకృతం కాలేకపోయిందని ఆమె పేర్కొన్నారు. 

 భారత్‌కు చెందిన ఆమె.. కెనెడియన్‌ పాస్‌పోర్టుపై.. ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)గా కొనసాగుతున్నారు. ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఐక్యరాజ్యసమితి అవసరమని ఆమె స్పష్టం చేశారు. అందుకే తాను పోటీలో ఉంటున్నట్టు తెలిపారు.

 ‘చాలామందికి ఇది సాహసంగా అనిపించవచ్చు. కానీ ఎవరో ఒక్కరే మొదట మాట్లాడాలి. ఒక్కరే చేసి చూపించాలి.  నేను మార్పు కోరుకొనే తరంలో ఉన్నాను. మార్పు గురించి మాట్లాడటం కాదు. మార్చి చూపించే తరం ఇది’ అని ఆకాంక్ష పేర్కొన్నారు. 

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్నది. ఆయన మరోసారి ఈ పదవిని చేపట్టాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.  ఐరాస భద్రతా మండలి సిఫారసు మేరకు సర్వ ప్రతినిధి సభ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొంటుంది. 

75 ఏండ్ల ఐరాస చరిత్రలో సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు. ఆకాంక్ష వయస్సు 34 ఏండ్లు. ఆమె కెనడాలోని యార్క్‌ వర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. కొలంబియా వర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.