ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశం 

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. రేపటిలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. 

చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతోపాటు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా.. నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్‌ విఫలమయ్యారని పేర్కొంటూ పుంగనూరు  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనీషారెడ్డి, టీడీపీ మాజీ ఎ మ్మెల్యే శంకర్‌, న్యాయవాది పారా కిషోర్‌ హైకోర్టులో శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గంగా మాచర్ల ముందంజలో ఉంది. 

గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచర్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. అంతేకాకుండా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. 

పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.