మంత్రి కొడాలికి ఎస్ఈసీ షోకాజ్‌ నోటిసు

ఎపి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ షోకాజ్‌ నోటిసులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ను కించపరుస్తూ.. మంత్రి కొడాలి ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఎస్‌ఇసి చర్యలు తీసుకుంది. 
 
ఈ అంశంపై సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా బహిరంగ ప్రకటన చేయాలని పేర్కొంది. ఒకవేళ ఈ అంశంపై వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఇసి హెచ్చరించింది.
 
ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు. ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందని చెప్పారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు.
మంత్రి తరఫున ఆయన  న్యాయవాది తానికొండ చిరంజీవి శుక్రవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కమీషన్ కార్యదర్శి కన్నబాబుని‌ కలిసి షోకాజ్‌ నోటీసుపై మంత్రి వివరణను అందించారు.
 
‘‘కొడాలి నాని ఎస్ఈసీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రికి చెడు కలిగించాలని ఈ నోటీసు ఇచ్చారు. నిమ్మగడ్డ. చంద్రబాబుల మధ్య ఉన్న బంధంపై ప్రజలు అనుకున్నదే మాట్లాడారు. ఒక పార్టీకి ఎస్ఈసీ కొమ్ము కాయడం వ్యక్తిగతమే. షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని రిప్లై ఇచ్చాం. మంత్రి మొదటి విడత ఎన్నికల ఫలితాల గురించి మాత్రమే ప్రేస్‌మీట్‌లో మాట్లాడారు. ఒకవేళ ఎస్‌ఈసీ వాటిని అసంబద్ధమైన, దురదృష్టకరమైన వ్యాఖ్యలుగా భావిస్తే మేం లీగల్‌గా ఎదుర్కొంటాం. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాం’’ అని తెలిపారు.