ఆర్టీఐ పేరిట బిల్డర్లను బెదిరిస్తున్న ఇద్దరు అరెస్టు

ఆర్టీఐ, హ్యూమన్‌ రైట్స్‌ యానిమల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటక్షన్‌ సెల్‌ పేరిట భవన నిర్మాణాలను చేపడుతున్న బిల్డర్లను బెదిరిస్తున్న ఇద్దరి వ్యక్తులను మాదాపూర్‌ ఎస్‌వోటీ, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశామని డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన బసంత్‌రాజ్‌, పువ్వులభార్గవ్‌కిరణ్‌లు కలిసి కేపీహెచ్‌బీ, అడ్డగుట్ట, సమతానగర్‌ ప్రాంతాల్లో భవన నిర్మాణాలను చేపడుతున్న బిల్డర్లను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని వారి నుంచి లక్షల రూపాయలను డిమాండ్‌ చేశారు. 

మాట వినని భవన నిర్మాణ యాజమానులపై ఆర్‌టీఐ, గ్రీవెన్స్‌ సెల్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తూ బసంతత్‌ రాజు బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కొందరు విలేకరులు తనకు సహకరించినట్లు నిందితుడు వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. 

నిందితుల బెదరింపులను తట్టుకోలేక బిల్డర్లు సైతం పెద్ద మొత్తంలో నగదును ముట్ట చెప్పారు. గతంలో ఓ మాజీ కార్పొరేటర్‌తో కలిసి ప్రధాన నిందితుడు బసంత్‌రాజు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు డీసీపీ తెలిపారు.

 కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, అడ్డగుట్ట పరిసర ప్రాంతాల్లో బిల్డర్లను బెదిరించి రూ. 50నుంచి రూ. 60లక్షల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు బసంత్‌రాజు 32ఆర్‌టీఐ దరఖాస్తులు, 23గ్రీవెన్స్‌ సెల్‌ ఫిర్యాదులు, ఒక పిల్‌ను వేసినట్లు తెలిపారు. ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా ఎస్‌వోటీ కేపీహెచ్‌బీ పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు.

 ఈ మేరకు ప్రధాన నిందితుడు బసంత్‌రాజుతో పాటు పువ్వుల కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ. 2లక్షల నగదు, రెండుసెల్‌ఫోన్లు, ఇన్నోవా క్రిస్టా కారు, హ్యూమన్‌రైట్స్‌, యానిమల్‌ ప్రొటెక్షన్‌ పేరిట ఉన్న లెటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెళ్లడించారు.