జయలలితకు వారసురాలినన్న శశికళ ఆస్తుల జప్తు 

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే వారుసురాలినని ఆమె నెచ్చెలి శశికళ ప్రకటించిన మరుసటి రోజుననే వందల కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం జప్తు చేసింది. అన్నాడీఎంకేలోని కోట్లాదిమంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె వెల్లడించిన 24 గంటలలోనే ఈ పరిణామం చోటుచేసుకొంది. 

అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తిచేసుకుని సోమవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. దారిపొడవునా 66 చోట్ల ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ ప్రముఖులు, కార్యకర్తల స్వాగత సత్కరాలు అందుకున్నారు. పార్టీ నాయకుడు దినకరన్‌ నాయకత్వంలో 30 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా శశికళ మీడియాతో మాట్లాడారు. తిరుపత్తూరు వద్ద ఓపెన్‌టా్‌ప వ్యాన్‌పై నిలబడి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 

తాను అన్నాడీఎంకే పార్టీ పతకాన్ని ఉపయోగించడంపై మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో తన రాకవల్ల కలుగుతున్న భయానికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. తన రాకతో మంత్రుల్లో వణుకు ప్రారంభమైందని ధ్వజమెత్తారు.

ఇలా ఉండగా, శశికళకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేయడం తమిళ రాజకీయాలలో ఆసక్తి కలిగిస్తున్నది. ఆమె ఆరోగ్యంపై రజనీ ఆరా తీశారు. ఈ విషయాన్ని శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ వెల్లడించారు. 

‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె ఇక్కడి చేరుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియాతో దినకరన్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన రజనీ అనంతనం విరమించుకున్న విషయం తెలిసిందే.

మరోవంక శశికళకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ తమిళనాడు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళ కు సంబంధించిన  వందల కోట్ల విలువైన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.సుప్రీంకోర్టు ఆదేశాలతో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది.

దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్‌ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.