పాల్‌ దినకరన్‌కు ఐటీ సమన్లు

ప్రముఖ క్రైస్తవ మతప్రబోధకుడు పాల్‌ దినకరన్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఆయనకు చెందిన కార్యాలయాలు, విద్యా సంస్థలతో కలిసి మొత్తం 28 చోట్ల ఏకకాలంలో ఐటీ శాఖ అధికారుల తనిఖీలు చేపట్టిన విషయం తెల్సిందే. 
 
ఈ తనిఖీల్లో పాల్‌ దినకరన్‌కు చెందిన జీసెస్‌ కాల్స్‌కు భారీగా విదేశాల నుంచి నిధులు వచ్చినట్టు గుర్తించారు. పైగా ఈ నిధులకు చెల్లించాల్సిన ఆదాయ పన్నును సక్రమంగా చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలతో పాటు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ తనిఖీలు పూర్తయ్యా యని, తనిఖీల సమయంలో దినకరన్‌ కటుంబ సభ్యులు పూర్తి సహాయసహకారాలు అందించినట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, జీసెస్‌ కాల్స్‌కు వచ్చిన నిధులపై పూర్తి వివరణ రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో కెనడాలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న పాల్‌ దినకరన్‌కు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసి, వచ్చే వారం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.