పాకిస్థాన్‌‌పై విరుచుకుపడిన భారత్  

దాయాది పాకిస్థాన్‌‌పై భారత్ విరుచుకుపడింది. పాక్‌‌లో హిందూ దేవాలయాలు కూలుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యింది. ప్రపంచంలో మతపరమైన నిర్మాణాలను రక్షించడం మీద యునైటెడ్ నేషన్స్ కట్టుబడి ఉండాలని, అటువంటి దాడులను ప్రోత్సహించొద్దని కోరింది.

 75వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. రోజురోజుకీ ఉగ్రవాదం, అసహనం పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు విధ్వంసానికి గురవుతున్నాయని భారత ప్రతినిధి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అఫ్గానిస్థాన్‌‌లో బామ్యాన్ బుద్ధుడి విగ్రహం ముక్కలవ్వడం, టెర్రరిస్టుల బాంబుల దాడిలో సిక్కుల గురుద్వారా ధ్వంసం అవ్వడంతోపాటు ఆ ఘటనలో 25 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. 

గత డిసెంబర్‌‌లో పాకిస్థాన్‌‌ ఉగ్ర దాడిలో చారిత్రక హిందూ ఆలయం ధ్వంసమవ్వడం పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఆలయం పై దాడి జరిగి, అది కూలిపోతున్నా పాక్ ప్రభుత్వం మౌనం వహిస్తూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యింది.