పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్

దేవాలయాలపై దాడుల వెనక బీజేపీ ఉందంటూ ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్  మాధవ్ మంగళగిరి వద్ద గల రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి పెద్ద్డ ఎత్తున లోనికి దూసుకు వెళ్లారు. 
 వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నారు.  
 
ఛలో డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలుపు ఇచ్చిన బీజేపీ నేతలను పోలీసులు విజయవాడతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును, గుంటూరు లో మాజీ మంత్రి  కన్నా లక్ష్మి నారాయణను హౌస్ అరెస్ట్ చేయగా, బిజెపి  ఎంపీ రమేష్ వస్తుండగా గన్నవరం విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
 
ఆలయాల ధ్వంసం కేసులో దోషులను పట్టుకోకుండా బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ ప్రకటించడం దారుణమని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోషల్ మీడియాలో పోస్టులు పెడితే  కూలగొట్టినట్లు ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా మంగళగిరి గాలిగోపురం సెంటర్‌లో ధర్నా చేపడతామని ప్రకటించారు.
 పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేనేం తప్పు చేశానని నా ఇంటికి పోలీసులు వస్తారు. అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడతారా?. నేను డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానని చెప్పానా?. గేటుకు అడ్డంగా పోలీసు వాహనాలను పెడతారా?’’ అని ప్రశ్నించారు.