కుంభమేళాకు హరిద్వార్ లోఎన్‌ఎస్‌జీ కమాండోలు

కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌)ను హరిద్వార్‌లో మోహరించనున్నట్లు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించారు. ఎన్‌ఎస్‌జీ (ఐజీ ఆపరేషన్‌) మేజర్ జనరల్ వీఎస్‌రనాడే  ఉత్తరాఖండ్‌ పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ను కలిసి కుంభమేళాలో ఎన్‌ఎస్‌జీ బలగాలను మోహరించడంపై చర్చించారు. 

‘దేశ వ్యతిరేక అంశాలపై చర్యలు తీసుకునేందుకు’ కుంభమేళా సందర్భంగా రెండు బృందాలను మోహరించనున్నట్లు ఆయన చెప్పారు. ‘ఎన్‌ఎస్‌జీ బలగాలు ఉగ్రవాద నిరోధక దళానికి కూడా శిక్షణ ఇస్తాయి’ చెప్పారు. 

ఇదిలా ఉండగా కొవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని హరిద్వార్‌లో కుంభమేళాలో జనం గుమిగూడకుండా నియంత్రించడం, ఇతర ఏర్పాట్లపై ప్రణాళిక సమర్పించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్, కుంభమేళా అధికారి కోర్టుకు హాజరు కావాలని సూచించారు.

ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ మనోజ్ కుమార్ తివారీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ధర్మాసనం పిటిషన్లను విచారించింది. రాష్ట్రంలోని ఐసోలేషన్‌ కేంద్రాలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మార్చి-ఏప్రిల్‌లో జరుగబోయే కుంభమేళను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో వెంటిలేటర్లు, ఐసీయూలు, బెడ్లు, పరికరాలు, సిబ్బంది సామర్థ్యం మొదలైన వివరాలను తెలియజేస్తూ ఫిబ్రవరి 21లోగా నివేదిక సమర్పించాలని హరిద్వార్‌ జిల్లా న్యాయమూర్తిని ధర్మాసనం ఆదేశించింది.

కుంభమేళా ఏర్పాట్ల వాస్తవాలను బయటకు తెచ్చేలా నివేదికను దాఖలు చేయాలని జిల్లా న్యాయమూర్తిని కోర్టు కోరింది. ఇదిలా ఉండగా  మహమ్మారి కారణంగా మూడున్నర నెలలకు బదులుగా కుంభమేళా 78 రోజుల పాటు హరిద్వార్‌లో జరుగుతుందని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మదన్ కౌశిక్ ఇంతకు ముందు ప్రకటించారు.