కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం 

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన గాలికి వదిలారని ఆరోపించారు. రాష్ట్రంలో వివేకానంద జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.

జనగామ లో నిన్న(మంగళవారం) కేవలం అయిదుగురు బీజేపీ కార్యకర్తలు మాత్రమే నిరసన తెలిపారని చెబుతూ వారితో ఎలాంటి ఇబ్బందులు కలిగాయో తెలపాలని డిమాండ్ చేశారు. జనగామలో నిన్న పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలను సిఐ, ఎస్ ఐ  లు ఇద్దరు విచక్షణా రహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఏ విధంగా లాఠీచార్జ్ జరిపింది దేశమంతా చూశారని అంటూ  సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొంతమంది ఐపీఎస్ అధికారులు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి వారి రక్తం కళ్ళ చూస్తున్నారని ఆరోపించారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారని, కానీ మానవత్వం లేని కేసీఆర్ మాత్రం స్పందించలేదని ధ్వజమెత్తారు. దేశంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు చేసుకోకూడదా అని ప్రశ్నించారు. 

బీజేపీ కార్యకర్తలు వివేకానంద జయంతి జరుపుకుంటుంటే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జనగామ ఘటనపై స్పందించాలని, కమిషనర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని, తమ సత్తా ఏంటో చూపిస్తామని  హెచ్చరించారు.   భవిష్యత్ కార్యాచరణ జనగామ గడ్డ నుంచే ప్రకటిస్తామని వెల్లడించారు.  దాడిచేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, వారిపై 307సెక్షన్లో కేసులు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. లేకపోతే నీ గడీలు బద్దలు కొడతామంటూ హెచ్చరించారు.