వాషింగ్టన్‌లో రెండు వారల పాటు ఎమర్జెన్సీ  

జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారానికి సమయం సమీపిస్తున్న కొద్దీ ఘర్షణలు చోటుచేసుకోనున్నాయన్న ఎఫ్‌బిఐ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో రెండు వరాల పాటు ఎమర్జెన్సీ విధించారు. 
 
బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర్‌ మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజధానిలోని క్యాపిటల్‌ భవనంతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ఎఫ్‌బిఐ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
“ఇవాళ అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. గత వారం ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.” అని వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొంది.
 
అలాగే ఎమర్జెనీ కారణంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా హోంలాండ్‌ సెక్యూరిటీ, ఫెడరల్‌ ఎమర్జెన్సీ మ్యానేజ్‌మెంట్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఈఎంఏ)లు చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే నిలువరించేందుకుగానూ కేంద్ర బలగాలకు ప్రత్యేక అధికారాలున్నాయి. 
 
వీటన్నింటికీ అయ్యే ఖర్చును కేంద్రప్రభుత్వమే భరించనుంది. మరోవైపు జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంపే ప్రోత్సహించారంటూ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పది లక్షల మంది హాజరైనా వారిని అదుపులో ఉంచగల మిలిటరీ, పోలీసు బలగాలు ఈ సందర్భంగా విధుల్లో ఉంటారు.