నవజాత శిశువుల మృతిపై ఎన్‌హెచ్ఆర్సీ నోటీసు

మహారాష్ట్ర లోని భండారా జిల్లా జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది నవజాత శిశువులు మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) మహారాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీలు నోటీసులు జారీ చేసింది.ఈ ఘటనపై నాలుగువారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించింది. 

నవజాత శిశువుల మృతి ఘటన మానవ హక్కుల ఉల్లంఘన అని అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లోపించడం వల్లనే ఈ ఘటన జరిగిందని ఎన్‌హెచ్ఆర్‌సీ అభిప్రాయపడింది. పదిమంది నవజాత శిశువుల మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. 

ఆసుపత్రుల్లో ఫైర్ ఆడిట్ నివేదికలు ఉండాలని, తప్పు చేసిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఆర్‌సీ సూచించింది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడమే కాకుండా ఇక ముందు ఆసుపత్రుల్లో సహాయక వ్యవస్థలను మెరుగుపర్చాలని ఎన్‌హెచ్ఆర్‌సీ కోరింది.

భండారా జిల్లా ఆసుపత్రిలోని పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సియూ) లో  శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు. పదిమంది మరణించారు.