ఆస్ట్రియాలో ఉగ్ర‌దాడి.. కాల్పుల్లో ఇద్ద‌రు మృతి

ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నాలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది.  న‌గ‌రంలోని ఆరు ప్రాంతాల్లో దుండ‌గులు రైఫిళ్ల‌తో ఫైరింగ్ జ‌రిపారు.  ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.  అనేక మంది గాయ‌ప‌డ్డారు. ఇది ఉగ్ర‌దాడి అని, ఓ సాయుధుడిని మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ సెబాస్టియ‌న్ కుర్జ్ తెలిపారు. 
 
 మ‌రో సాయుధుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్న‌ట్లు హోంశాఖ మంత్రి తెలిపారు.  వియ‌న్నా సెంట్ర‌ల్‌లో ఉన్న యూద మందిరం వ‌ద్ద షూటింగ్ జ‌రిగింది.  అయితే మందిరాన్ని టార్గెట్ చేశారా లేదా అన్న అంశం స్ప‌ష్టంగా తెలియ‌దు. 
 
దాదాపు 14 మంది గాయ‌ప‌డ్డార‌ని, వారంతా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు మేయ‌ర్ మైఖేల్ లుడ్‌విగ్ తెలిపారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆస్ట్రియా తాజాగా దేశ‌వ్యాప్తంగా కొత్త లాక్‌డౌన్ ఆంక్ష‌లు విధించింది.
ఈ నేప‌థ్యంలో చాలా మంది జ‌నం బార్లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఎగ‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలో భారీ ఆయుధాల‌తో వ‌చ్చిన సాయుధులు.. కేఫ్‌లు, రెస్టారెంట్ల వ‌ద్ద ఉన్న జ‌నంపై కాల్పులు జ‌రిపారు. ఉగ్ర‌దాడిని ఐరోపా నేతలు ఖండించారు.  ఉగ్ర‌దాడితో షాకైన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌ర్  తెలిపారు.  స్టీటెన్‌టెట్టింగ్‌గేస్ యూద మందిరం వ‌ద్ద కాల్పులు ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు చెప్పారు.
ఆటోమెటిక్ రైఫిల్‌, పిస్తోల్‌తో ఉన్న ఓ సాయుధుడిని పోలీసులు హ‌త‌మార్చారు. దాడి త‌ర్వాత యూద మందిరాన్ని మూసివేసిన‌ట్లు యూద వ‌ర్గ నేత ఆస్క‌ర్ డిస్చ్ తెలిపారు.