పుల్వామా ఉగ్రదాడి తమదే … పాక్ మంత్రి ఒప్పుకోలు 

గత ఏడాది మొత్తం ప్రపంచాన్ని విస్మయంకు గురిచేసిన పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకు బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు ఇదంతా తామే చేశామని ఒప్పుకున్నది. అది కూడా ఆ దేశానికి చెందిన సీనియర్ మంత్రి ఒకరు పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ఈ విషయం వెల్లడించారు.

లోక్ సభ ఎన్నికలలో గెలుపుకోసం ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడికి బీజం వేశారని అంటూ ఆరోపణలు చేస్తున్న మనదేశంలోని ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఏమంటారో చూడాలి. . ఆ ఉగ్రదాడి పూర్తిగా తమ పనేనని పాక్‌ సీనియర్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి ఆ దేశ పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించారు.

అంతేకాదు ఆ ఉగ్రదాడి తమ ప్రజల విజయంగా అభివర్ణించారు.  భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించే అంశంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా వణికిపోయారని ప్రతిపక్ష నేత, ఎంపీ సాదిక్‌ పార్లమెంటులో వెల్లడి చేయడంతో అంతర్జాతీయంగా నవ్వులపాలైన తమ దేశ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఆ మంత్రి ఉగ్రదాడి తమ కుట్ర అని ఒప్పుకోవలసి వచ్చింది.

భారత్‌ను భయపెట్టామని గొప్పలు చెప్పుకోబోయిన పాకిస్థాన్‌ మంత్రి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్నట్లు భరత్ చేస్తున్న ఆరోపణలకు బలమైన సాక్ష్యాన్ని ఇచ్చిన్నట్లయింది.   తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టు తమ పార్లమెంట్‌ వేదికగా తన నోటితో తనే ప్రపంచానికి చెప్పినట్టు అయింది.

జాతీయ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బెలూచిస్తాన్‌ ఎంపీలు మోదీ, మోదీ  అంటూ నినాదాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు “హమ్నే హిందుస్తాన్ కో గుస్ కే మారా (మేము వారి ఇంటిలోకి చొరబడి కొట్టాం). పుల్వామాలో మాదే విజయం. ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో ప్రజల విజయం. మీరు, మనమందరమూ ఆ విజయంలో భాగస్థులం” అని పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు.

‘భారత్‌లోకి చొరబడి భారత సైనికులను 40 మందిని చంపేశాం. పుల్వామా విజయం పాకిస్థాన్‌ ప్రజల విజయం” అంటూ గొప్పలు చెప్పుకొన్నారు. అయితే ‘ పుల్వా విజయం’ అన్న మాటపై పార్లమెంటులో కలకలం రేగడం, ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి మాట మార్చారు. పుల్వామా ఘటన తర్వాత మనవాళ్లు భారత్‌లోకి చొచ్చుకెళ్లారు అంటూ ఏదో చెప్పబోయారు. 

ఈ ప్రకటన అసెంబ్లీలో కలకలం రేపడంతో  తన మాటలను తప్పుగా అన్వయించుకోవద్దని, “పుల్వామా కే వాకియేహ్ కే బాద్, జబ్ హమ్నే ఇండియా కో గుస్ కే మారా (పుల్వామాలో జరిగిన సంఘటన తర్వాత మేము వారి ఇంటిలోకి చొరబడి కొట్టాం) అని చెప్పుకొచ్చారు.

తర్వాత ఒక ట్వీట్‌లో “మా విమానాలు పోరాట సంస్థాపనలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు చొరబడి కొట్టాం” అంటూ నష్ట నివారణకోసం విఫల యత్నం చేశారు. 

ఇలా ఉండగా, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడిచి పెట్టకపోతే, పాకిస్థాన్‌ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసేవాళ్లమని భారత్ వాయుసేన మాజీ అధిపతి బీఎస్‌ ధనోవా వెల్లడించారు. అభినందన్‌ విడుదల విషయంలో జరిగిన పరిణామాల గురించి పాక్‌ ఎంపీ వివరాలు వెల్లడించిన సందర్భంలో ఆయన అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 

పాక్‌ చెరలో అభినందన్‌ ఉండటంపై ఆయన తండ్రి ఆందోళన వ్యక్తం చేశారని చెబుతూ అభినందన్‌ను తప్పకుండా తీసుకువస్తామని ఆయన తండ్రికి తాను భరోసా ఇచ్చానని చెప్పారు. భారత్‌ సైనిక సామర్థమేమిటో పాక్‌కి తెలియంది కాదని, అందుకే అభినందన్‌ను విడిచిపెట్టిందని ధనోవా తెలిపారు.