సీఎం తాత వచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరు

ముఖ్యమంత్రి తాత వచ్చినా దుబ్బాకలో బీజేపీ విజయాన్ని ఆపలేరని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి రెండు పెన్షన్లియ్యాల్సిందేనన్న ఆయన రఘునందన్  గెలిచాక అసెంబ్లీలో మొదటి చర్చ పెన్షన్ల మీదే ఉంటుందని ప్రకటించారు. 

దుబ్బాక నియోజకవర్గంలోని మోతెలో ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. తర్వాత దౌల్తాబాద్ లో జరిగిన గొర్రె కాపరుల సమ్మేళనంలోనూ పాల్గొని మాట్లాడారు. కులాలను అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందినవారని నట్టేట ముంచి కేసీఆర్ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. నీచమైన అవినీతిపరుడైన సీఎంను ఎన్నుకున్నందుకు.. దేశమే ప్రశ్నిస్తుంటే రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

బీసీలను రాష్ట్ర సీఎం నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తే బీజేపీ అడ్డుకుందని స్పష్టం చేశారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై కేసీఆర్‌ మాట్లాడలేదని, హైదరాబాద్‌ లో భారీ వర్షాలకు ఇళ్లు నీటమునిగితే.. కేసీఆర్‌ మాత్రం ఫామ్ ‌హౌస్ ‌లో పడుకున్నారని ధ్వజమెత్తారు. కేంద్రానికి వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు పెట్టే యోచనలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా మీటర్లు పెడితే మీ సంగతి తేలుస్తామని సంజయ్ హెచ్చరించారు.

 ‘‘కేంద్రం నిధులు ఇవ్వలేదంటున్నావు. మేం చెబుతున్నది తప్పంటున్నావు. కేసీఆర్‌.. దుబ్బాక బస్టాండ్‌లో చర్చకు రా.. నేను ఒక్కడినే వస్తా. కాషాయపు జెండా పట్టుకుని వస్తా చర్చిద్దాం. నా మాటలు తప్పయితే దుబ్బాక బస్టాండ్‌లోనే ఉరేసుకుంటా’’ అని సంజయ్‌ సవాల్‌ విసిరారు.
 
ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌.. పంపిణీ సంస్థలకు బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతులకు ఇస్తే.. వారు చెల్లించడం ద్వారా డిస్కమ్‌లు బలోపేతమవుతాయన్నారు. దీనిని వక్రీకరిస్తూ మోటార్లకు మీటర్లు అంటూ పెడబొబ్బలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
కాగా, సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆరేండ్లలో వందల ఎకరాల ఫామ్ హౌస్​లు వచ్చాయి కానీ… రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం’ కమీషన్ల డబ్బుతో కేసీఆర్‌‌‌‌ దుబ్బాక బైఎలక్షన్​లో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
దుబ్బాక టౌన్ బాలాజీ ఫంక్షన్ హాల్ లో దళిత మోర్చా నిర్వహించిన సభలో మాట్లాడుతూ  సీఎం సొంతూరు చింతమడకలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి రాష్ట్రంలోని పేదలకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే సీఎం నుంచి జవాబు లేదని దయ్యబట్టారు. ఆయన మాత్రం కమీషన్ల డబ్బుతో వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకుంటున్నారని విమర్శించారు.
 
మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ దళితులు ఎవరికి వోటు వేస్తే ఆ క్యాండిడేటే గెలుస్తాడని చెబుతూ దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల మొఖం చూడని సీఎం దేశంలో ఎవరైనా వున్నారంటేఅది ఒక్క కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి బాబుమోహన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి ఇన్నేండ్లు అయితున్నా దళితుల అభివృద్ధి జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.