సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించే కుట్ర  

సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాలని కొందరు కుట్ర పన్నుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగపూర్ లో జరిగిన వార్షిక దసరా ఉత్సవాలలో మాట్లాడుతూ  సీఏఏ గురించి సమగ్రంగా చర్చించడానికి ముందే అందరి దృష్టి కరోనా వైపు మళ్లిందని చెప్పారు.
ప్రత్యేకించి ఏ ఒక్క మతాన్నో సీఏఏ వ్యతిరేకించడం లేదు. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకించిన కొందరు మాత్రం ముస్లిం సోదరులను తప్పుడు భావనలతో ప్రేరేపించారని విచారం వ్యక్తం చేశారు. ముస్లింల జనాభాను నియంత్రించేందుకే ఈ చట్టం ఉద్దేశించబడినదని వారిని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.
కొందరు అవకాశవాదులు సీఏఏ నిరసనల పేరుతో శాంతికి భంగం కలిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రావడంతో సీఏఏ నుంచి అందరి ద‌ృష్టి మహమ్మారి వైపు మళ్లింది. కానీ ఇప్పటికీ కొన్ని అల్లర్ల మూకలు, అవకాశవాదులు సీఏఏపై నిరసనలు కొనసాగాలని ప్రయత్నిస్తున్నారని భగవత్ హెచ్చరించారు.
‘గతేడాది ఆర్టికల్ 370 రద్దయ్యింది. ఆ తర్వాత నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పును వెల్లడించింది. మొత్తం దేశం ఆ తీర్పును స్వాగతించింది. ఈ ఏడాది ఆగస్టు 5న రామ మందిర పునర్నిర్మాణంలో భాగంగా భూమి పూజ వేడుక జరిగింది. ఈ అన్ని వేడుకల సందర్భాల్లోనూ భారతీయుల సహనం, సున్నితత్వానికి మనం సాక్ష్యాలుగా నిలిచాం’ అని డా. భగవత్ పేర్కొన్నారు.

కాగా, శక్తి, విస్తీర్ణం పరంగా భారత్‌.. చైనాకంటే పెద్దదిగా ఎదగాలని,  చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా భారతదేశం మెరుగ్గా సిద్ధం కావాలని ఆయన పిలుపిచ్చారు. కరోనా మహమ్మారి సందర్భంగా చైనా పాత్ర పట్ల నుండే అన్ని ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని గుర్తు చేశారు. 

మహమ్మారి మధ్య చైనా మన సరిహద్దుపై దండెత్తిందని, ఆ దేశ విస్తరవాద స్వభావాని మొత్తం గుర్తించేటట్లు చేయగలిగామని తెలిపారు. భారత్ తగు విధంగా చైనా దురాక్రమణ యత్నాలను తిప్పి కొట్టగలిగినదని సంతోషం వ్యక్తం చేశారు. మన దేశ సైనికులకున్న దేశభక్తి, దేశ రక్షణ విషయంలో గల అకుంఠిత దీక్ష, దేశాన్ని పాలిస్తున్న నేతలకు ఉన్న స్వాభిమానం ఉన్నతమైనవని కొనియాడారు.

‘మనం అందరితో స్నేహం చేయాలని కోరుకుంటాం. అది మన నైజం. అయినప్పటికీ బలహీనతల పట్ల మన కరుణను తప్పుగా అంచనా వేసి, క్రూరశక్తి ద్వారా విచ్ఛిన్న౦ చేయడానికి ప్రయత్ని౦చడ౦ అ౦గీకారయోగ్య౦ కాదు’ అని స్పష్టం చేశారు. ఈ విషయం మన ప్రత్యర్థులకు ఇప్పుడే తెలియజేయాలని సూచించారు.

కరోనా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, కానీ మరణాలు తక్కువగా ఉన్నాయని చెబుతూ అంటువ్యాధి కారణంగా పరిశుభ్రత, పర్యావరణం ప్రాముఖ్యతను తిరిగి నేర్చుకోవడం ప్రారంభించామని పేర్కొన్నారు.   కొవిడ్‌ నిబంధనల మేరకు ఈ సారి 50 మంది మాత్రమే  కార్యక్రమంలో పాల్గొన్నారు.