స్థానిక వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి 

పండుగల సమయంలో చేసే షాపింగ్ లలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.

కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న విషమ పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సురక్షితంగా, నిరాడంబరంగా  పండుగను జరుపుకోవాలని  సూచించారు.

అంతకు ముందు దసరా నాడు పెద్ద జాతరలు కూడా జరిగేవని, కానీ ఈ సారి వాటి రూపం కూడా మరిపోయిందని ప్రధాని పేర్కొన్నారు. రామ్ లీలా పండుగ కూడా ఒక పెద్ద ఆకర్షణ. కానీ దానికి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున సభలు నిషేధించారని వివరించారు. 

రాబోయే రోజుల్లో ఈద్, శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి, దీపావళి, ఛఠ్‌పూజ, గురునానక్‌ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో మనం సంయమనంతో పని చేయాల్సి ఉందని మన్ కీ బాత్‌లో చెప్పుకొచ్చారు.

‘పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలనే విషయం ఆలోచించినప్పుడు ముందుగా మార్కెట్‌‌కు వెళ్తాం. ఈసారి మీరు మార్కెట్‌‌కు వెళ్లినప్పుడు.. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని గుర్తు చేసుకోండి. మార్కెట్‌‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో స్థానిక వస్తువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి.’ అని సూచించారు. 

ఈ ఏడాది గాంధీ జయంతి సమయంలో ఢిల్లీలోని కొన్నాట్ ప్రాంతంలోని ఖాదీ స్టోర్‌‌లో ప్రజలు రూ.1 కోటి విలువైన షాపింగ్ చేశారని చెప్పారు. కరో్నా సమయంలో  ఖాదీ మాస్క్‌‌లు బాగా పాపులర్ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. దీని వల్ల ఖద్దరు పాపులారిటీ పెరగడంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఖద్దరు విస్తరించేందుకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 

అలాంటి ఓ చోటే మెక్సికోలోని ఓక్సాకా. ఇక్కడి స్థానిక గ్రామస్థులు ఖాదీని నేస్తారు. భారత్  వోకల్ ఫర్ లోకల్‌‌గా మారితే మొత్తం ప్రపంచం మన స్థానిక ఉత్పత్తులకు అభిమానిగా మారుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. 

ధైర్యవంతమైన సైనికులు, భద్రతా దళాలతో భారతదేశం దృఢంగా ఉందని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. కొత్తగా కరోనా మహమ్మారి మధ్య పండుగలను జరుపుకుంటుండగా సైనికులకు ఒక దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. 

సరిహద్దుల్లో కాపలా కాస్తూ బయటి నుంచి వచ్చే ముప్పు నుంచి దేశం సురక్షితంగా ఉండేందుకు సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈద్‌, దీపావళి వంటి అనేక పండుగలు ఈ ఏడాదిలో జరుగాయని, ఆయా సమయాల్లో సరిహద్దులో నిలబడిన మన ధైర్య సాహసాలు గల సైనికులను కూడా స్మరించాలని సూచించారు. 

ఈ ధైర్యవంతులైన కొడుకులు, కూతుళ్ల గౌరవార్థం మనం ఇంట్లో దీపం వెలిగించాలని మోదీ కోరారు. చైనాతో నెలకొన్న వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.