ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయం నిషేధం  

దేశంలోని ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయంపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. పెర్నాడ్‌, డియాజియో మద్యం దిగుమతులను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 4వేల ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యంతోపాటు వస్తువులను విక్రయించరాదని ఆదేశించింది. 

కాగా, సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు విదేశీ మద్యం, ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పాటు ఇతర వస్తువులను రాయితీపై ఆర్మీ క్యాంటీన్లలో అందిస్తుంటుంది. ఇకపై విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకోరాదని రక్షణ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ అంశంపై మే, జులై నెలల్లో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం అధికారులతో చర్చించామని, దేశీయ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.