దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా వ్యాక్సిన్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గెలుపొందితే ప్రజల అందరికి కరోనా వ్యాక్సిన్ తమ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని ఎన్నికల ప్రణాళికలో బిజెపి పేర్కొనడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నది. బిజెపికి ఓట్ వేస్తేనే, ఆ రాష్ట్రంలోనే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా అంటూ కొన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. 
 
వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. భారత్‌లో మొత్తం జనాభాకు కరోనా టీకాలు ఉచితంగా వేయటానికి కేంద్రప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను ఇప్పటికే సిద్ధం చేసిందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. 
 
అందరికీ టీకాలు వేయటానికి రూ.51,592 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టి, ఆ మేరకు నిధులను సమీకరించారని వెల్లడించాయి. మంగళవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాక్సిన్  సిద్ధం కాగానే దేశంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రధాని పేర్కొనడం ఈ సందర్భంగా విశేష ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
 
దేశంలోని 130 కోట్ల జనాభాకు కరోనా వ్యాక్సిన్‌ కోసం అవసరమైన నిధుల సమీకరణ జరుగుతున్నట్లు అధికార వర్గాలు సంకేతం ఇస్తున్నాయి. ఒక వ్యక్తికి కరోనా వ్యాక్సిన్  వేసేందుకు సుమారు రూ.450 నుంచి రూ.500 వరకు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. 
దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు రెండు దఫాలుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దఫాల వ్యాక్సిన్‌కు ఒక్కొరికీ  రూ 150 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 
 
దీనికితోడు వ్యాక్సిన్‌ను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు, వాటి నిల్వ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఒక్కొక్కరికీ మరో మూడు వందల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దీనికి అవసరమ్యే నిధులను ఈ ఏడాది మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచే సమకూర్చనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, హిమాలయాల నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మారుమూల ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయడానికి సుమారు రూ.80,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ అధిపతి అదార్ పూనవల్లా అంచనా వేశారు. 
 
వ్యాక్సిన్ తొలుత అందరికీ లభ్యం కాదని, ప్రతి ఒక్కరికి చేరేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు.  మరోవైపు ప్రపంచ జనాభాకు అవసరమైన కరోనా వ్యాక్సిన్లను ఆకాశ మార్గంలో తరలింపు కోసం సుమారు 8 వేల రవాణా విమానాలు అవసరమవుతాయని నిఫుణులు అంచనా వేస్తున్నారు.